ఒడిశా నుంచి తప్పించుకుని వచ్చిన నిరుద్యోగ యువకులు
దేవరకద్ర(మహబూబ్‌నగర్): చదువుకున్న నిరుద్యోగులకు ఎర వేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, రూ.వేలల్లో జీతం, మంచి భవిష్యత్‌ను కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పలువురిని ఒడిశాకు తీసుకువెళ్లి శిక్షణ పేరుతో నిర్బంధానికి గురి చేసిన ఘటన ఇది. అక్కడి నుంచి కొందరు యువకులు తప్పించుకుని రావడంతో విషయం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ దేవరకద్రకు చెందిన కొందరు యువకులు, ఒక యువతి ఇప్పటికి అక్కడే వారి నిర్బంధంలో ఉన్నట్లు తప్పించుకుని వచ్చిన వారి ద్వారా తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ముందుగా కొందరు నిరుద్యోగలకు ఎర వేసి వారి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకుని తిరిగి వారి ద్వారామరి కొందరిని చైన్ సిస్టం మాదిరిగా లాగుతున్నట్లు సమాచారం. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారినే ఎక్కువగా తమ చైన్ సిస్టంలోకి లాగుతున్నారు.
సభ్యత్వానికి డబ్బు వసూలు
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ కంపెనీలో చేరడానికి రూ.10,500 చెల్లించాలని, ఆ తర్వాత భోజనం ఖర్చు కింద రూ. 6 వేలు చెల్లిస్తే ఇక రూ.16 వేల నుంచి రూ. 18 వేల వరకు నెలకు వేతనం వస్తుందని మాయమాటలు చెబుతున్నట్లు సమాచారం. ఇలా అంగీకరించిన వారిని ఒడిశాలోని బద్రక్ జిల్లాకు వచ్చేలా చేస్తున్నారు. అక్కడి వెళ్లాక వారి నుంచి రూ. 16,500 తీసుకుని.. ఒక గాల్‌వే బ్యాగ్ అందులో కొన్నిరకాల క్రీములు, పౌడర్లు, ప్రొటీన్ డబ్బాలు ఇస్తున్నారు. గ్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద గాల్‌వే బ్రాండ్ వస్తువులను అంటగడుతున్నారు. అలాగే, ఒడిశాకు వచ్చిన వారికి సూటు వేయించి ఫొటో తీసి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు ఐడెంటిటీ కార్డు జారీ చేస్తున్నారు. ఇదంతా చూసిన నిరుద్యోగులు ఆశతో ఉంటున్నారు.
బద్రక్ జిల్లాలో అద్దెకు తీసుకున్న గదుల్లో పది నుంచి ఇరవై మంది వరకు ఉంచి రెండు పూటల భోజనం మాత్రం పెట్టి తరగతులు నిర్వహిస్తూ చివరకు గాల్‌వే ఉత్పత్తులు ఎలా విక్రయించాలో చెబుతున్నారు. ప్రతీ సభ్యుడు ముగ్గురిని సభ్యత్వం చేయించాలని, ముందుగా తీసుకున్న వారి స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఫోన్ చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా వెళ్లిన వారెవరూ బయటకు వెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల నుంచి రెండు నెలలు పూర్తయ్యాక ఉద్యోగం లేదనే విషయం తెలుసుకుని గ్రామాలకు వెళ్తామని చెప్పినా కంపెనీ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. ఇరుకు గదుల్లో నెలల తరబడి ఉండడం దుర్భరంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టేజీ వన్ నుంచి ఫోర్ వరకు సభ్యత్వాలను చేయిస్తే రూ.74 వేలు అకౌంట్‌లో వేస్తాం, ఆ తర్వాత రూ.లక్ష, చివరగా రూ.5 లక్షలు వస్తాయని ఆశపెడుతూ ఇతరులకు ఫోన్లు చేయించి మోసం చేయిస్తున్నారని బాధితులు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
దేవరకద్రకు చెందిన ఎరుకలి వెంకట్రాములు, ఎ రుకలి శివ, కురుమూర్తి, బల్సుపల్లి నర్సింహా ఒ డిశాలో నిర్బంధం తప్పించుకుని వచ్చారు. అదే విధంగా మద్దూర్ మండలం నిడ్జింతకు చెందిన ఆంజనేయులు కూడా వీరి వెంట వచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం విషయం పోలీసులకు వివరించారు. తమకు జరిగిన అన్యాయమే చాలా జరుగుతోందని తెలిపారు. తన తమ్ముడు రాము, చెల్లెలు రామలక్ష్మీ ఇప్పటికి ఒరిస్సాలోనే వారి నిర్బంధంలో ఉన్నారని ఎరుకలి వెంకట్రాములు తెలిపారు. ఈ మేరకు వారిని విడిపించి తీసుకు రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment