సాక్షి, టెక్కలి రూరల్: నియోజకవర్గ కేంద్రం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి కొడ్రవీధి జంక్షన్ వద్ద ఆదివారం పట్టపగలే నడిరోడ్డుపై వృద్ధురాలి వద్ద పోలీసుల పేరుతో(నకిలీ పోలీసులు) ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని తరస్కరించారు. సీనీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై వృద్ధురాలు దండా హేమలత తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత టెక్కలి మెయిన్ రోడ్డులో నివాసముంటుంది. బంధువుల ఇంటికి కొడ్రవీధి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముందు ఆగారు. తాము పోలీసులమంటూ వారి దగ్గరున్న డమ్మీ ఐడీ కార్డు చూపించారు. మెడలో అంత బంగారం వేసుకోని తిరగవద్దని, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పారు.
బంగారమంతా తీసి ఆమెతో తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్పారు. ఆమె అనుమానంగా చూడటంతో వీధిలోంచి మరో వ్యక్తి వచ్చాడు. అతనికి కూడా అలాగే చెప్పారు. అతను తన చైన్, బంగార వస్తులు, డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకోని వెళ్లిపోయాడు. అతనిని అనుసరిస్తూ ఆమె కూడా అదేవిధంగా తాళిబొట్టు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి బ్యాగ్‌లో పెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగారం అంతా భద్రంగా ఉందో, లేదో చూస్తానని బ్యాగ్ అడిగాడు. వస్తువులన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి ఆమెను పంపించేశారు. ఇంటికి వెళ్లి తాళి, గాజు లు వేసుకోడానికి బ్యాగ్ చూసేసరికి అందులో ఆ వస్తువులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై టెక్కలి సీఐ నీలయ్య బాధితురాలు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి గాజులు, తాళిబొట్టు కలిపి సుమారు 5 తులాలు ఉంటాయని బాధితురాలు రోదిస్తోంది. సీఐ నీలయ్య, ఎస్‌ఐ గణేష్‌లు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. బాధితురాలు హేమలత, భర్త శ్రీరామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోచోట విఫలయత్నం..
పై ఘటన జరగక ముందు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు స్థానిక సంతోషిమాత గుడి సమీపంలో భవానీనగర్‌కు చెందిన విజయలక్ష్మి అనే మహిళను కూడా ఇలాగే నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారం తీసి దాచుకోవాలని సూచించడంతో ఆమె బంగారం అంతా తీసి తన చీరలో కట్టివేసింది. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంత సమయానికే వృద్ధురాలి వద్ద బంగారం అపహరించారు.
Comments
Please login to add a commentAdd a comment