జె.పంగులూరు/నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలంలోని రామకురుకు చెందిన పెనుబోతు సోమశేఖర్, విజయలక్ష్మి దంపతులతోపాటు వారి ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం తల్లీబిడ్డల మృతదేహాలను మంగళవారం రామకూరుకు తీసుకొచ్చారు. తండ్రితోపాటు ఈ ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం పోలీసుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు.
ముందుగానే బంగారు నగలు పుట్టింటికి..
విజయలక్ష్మి రైలు కింద పడి మరణించాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి ఆ తరువాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తన బిడ్డలతో ఫొటో తీయించుకోవడంతోపాటు, తన ఒంటిపై ఉన్న బంగారు నగలను, తీసి మూటగట్టి తెలిసిన వారితో పుట్టింటికి పంపింది. విజయలక్ష్మి ఇలా ఎందుకు చేసిందో ఆరా తీసి, బంధువులు అక్కడికి చేరకునే సరికే అనంత లోకాలకు పయమై పోయారు. తన ఇద్దరు పిల్లలను చీరతో కదలకుండా కట్టేసి నరసరావుపేటలో రైల్వే ట్రాక్‌పై పడేసింది. వారిపై రైలు ఎక్కిన తర్వాత తానూ అదే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందని ఘటనాస్థలానికి సమీపంలో ఉన్నవారు తెలిపారు. ట్రాకు పక్కనే ఉన్న కొందరు పిల్లల కేకలు విని అక్కడికొచ్చేలోపే, దారుణం జరిగిపోయింది. తల్లి, ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాకుపై రక్తపు మడుగులో నెత్తుటి ముద్దలుగా మారారు. సాయిగణేశ్ తల ఆనవాళ్లు మినహా విజయలక్ష్మి, దిగ్విజయ మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి. ఆకారాలే లేవు.
షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారా..?
నీకేం కష్టం వచ్చిందమ్మా... చూస్తూ చూస్తూనే ఎంత పని చేశావే తల్లీ.. అంటూ విజయలక్ష్మి మృతదేహం వద్ద ఆమె తల్లి అన్నపూర్ణమ్మ రోదన.. గణేశా.. షేక్ హ్యాండ్ ఇవ్వరా.. అంటూ మనవల మృతదేహాల వద్ద తాత పేరయ్య విలపించిన తీరు చూపరుల హృదయాన్ని కలిచివేసింది. రోజూ బడికి వెళ్లే సమయంలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్లు కదా. ఈ రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారే.. ఇక నాకు ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తారంటూ పేరయ్య మృతదేహాలపై పడి విలపించాడు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ రామకూరు వెళ్లి మృతదేహలకు నివాళులు అర్పించారు.
బరువెక్కిన హృదయాలతో తుది వీడ్కోలు..
భర్త సోమశేఖర్ మృతదేహంతో సహా నలుగురికి ఒకే సారి బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో గ్రామంలోని పిల్లా పెద్దలతో సహా అందరూ పాల్గొన్నారు. గ్రామస్తులంతా మంగళవారం ఆ కుటుంబానికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ నాగరాజు తమ సిబందితో గ్రామంలో అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా పర్యవేక్షించారు. కుటుంబసభ్యుల ఆత్మహత్యలపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు.
ఘటన వెనుక ఎన్నో ప్రశ్నలు..
ముక్కు పచ్చలారని పిల్లలను వదలకుండా వారితో సహా రైలు కింద పడి మృతిచెందిన తల్లి విజయలక్ష్మి, ఎందుకంత కర్కశ నిర్ణయం తీసుకుంది? చిన్న కారణానికే పంతం పట్టి మరణించాలని నిర్ణయించుకుందా? వారిపై ఎంత ప్రేమ లేకపోతే వారి మరణ వార్త విన్న వెంటనే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు? ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నలుగా మిగిలాయి. తన భర్త ఆయన తండ్రి, సోదరుడితో కలిసి వ్యవసాయం చేయడం, ప్రతి అవసరానికి డబ్బులు వారిని అడుగుతుండటంపై తరచూ సోమశేఖర్, విజయలక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువలు ద్వారా తెలిసింది. సోమవారం కుమార్తె పుట్టిన రోజు సందర్బంగా కొత్త బట్టలు తెచ్చే విషయంలో గొడవ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనకు ఇదే కారణం అయివుండవచ్చిన కొందరు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment