
పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న గోపి కుటుంబ సభ్యులు
కాలానుగుణంగా మార్పు కోరుకుంటున్న తరుణంలో ఇంకా వెలి సంస్కృతి కోరలు చాస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల వారు దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యకు కారణమవుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరదయ్యపాళెం : మండలంలోని కారిపాకంలో తరచూ వెలి సంస్కృతి కనిపిస్తోంది. గతంలో అనేకమార్లు ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలను వెలి వేశారు. తాజాగా చోడవరం సురేష్ కుటుంబాన్ని వెలివేశారు. సంబంధిత కుటుం బంతో మాట్లాడారనే నెపంతో కారికేటి గోపి, అతని భార్య చంద్రమ్మపై అదే గ్రామానికి చెందిన తిరుపతి, సురేష్, సందీప్, మరికొందరు ఈ నెల 12వ తేదీన దాడి చేశారు. అంతేకాక గురువారం రాత్రి మరోమారు దాడికి పాల్ప డ్డారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేశారు.
వారు పట్టించుకోకపోవడంతో 14వ తేదీన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ దాడులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయలేదు. దీనిపై బాధితులు మొత్తం శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. తమ కుటుంబాన్ని హతమారుస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమకు ఏమాత్రం రక్షణలేదని ఆవేదన చెందుతున్నారు. ఎస్‌ఐ అందుబాటులో లేనికారణంగా కేసు నమోదు చేయలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.