ముఖేష్ (ఫైల్) పెంటప్ప (ఫైల్)
చంపాపేట/శామీర్‌పేట: పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ తొలి ఆహ్వాన పత్రికను మల్లన్న సన్నిధిలో ఉంచి పూజలుచేయించేందుకు కొమురవెల్లి వెళ్తున్న తండ్రీ కొడుకులు బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు... చంపాపేట డివిజన్ రెడ్డి బస్తీ కాలనీకి చెందిన ధన్ని పెంటప్ప (58)భవన నిర్మాణ కార్మికుడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు ముఖేష్ (29) ఎంబీఏ పూర్తి చేసి రామంతాపూర్‌లోనిఓ సంస్థలో పని చేస్తున్నాడు.
ఇటీవల అతడికి పెళ్లి కుదిరింది. నవంబర్ 10న పెళ్లి జరగాల్సి ఉంది. మొదటి ఆహ్వాన పత్రికను కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో ఉంచి పూజలు చేయడం వారి కుటుంబ ఆచారం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తండ్రీకొడుకులు కొమురవెల్లి బయలుదేరారు. శామీర్‌పేట పరిధిలోని తుర్కపల్లి వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో పెంటప్ప, ముఖేష్ మృతి చెందిన విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు చంపాపేటలోని వారి ఇంటికి తరలి వచ్చారు. ముఖేష్ పెళ్లికి హాజరు కావాలనుకున్న తాము ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదని విలపించారు. స్థానిక కార్పొరేటర్ సామ రమణారెడ్డి, డివిజన్ నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment