కొండగట్టు (చొప్పదండి) : కొండగట్టు దర్శనానికి వెళ్లిన కుటుంబ సభ్యులను పథకం ప్రకారం హతమార్చేందుకు యత్నించాడో కర్కోటకుడు. రెండేళ్ల కూతురును చంపి.. అనంతరం రెండో కూతురు, భార్యను హత్య చేసేందుకు యత్నించగా.. భార్య తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం భర్తతో పాటు రెండో పాప ఆచూకీ లభించడం లేదు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొగ్గులకుంట వద్ద సోమవారం వెలుగు చూసింది. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం శివపురి గ్రామానికి చెందిన అశోక్ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలసి శనివారం కొండగట్టు దర్శనానికి వచ్చాడు. రాత్రి ఇక్కడే నిద్రించి ఆదివారం మధ్యాహ్నం భార్యా పిల్లలను తన వెంట బొగ్గులగుంట వైపు తీసుకెళ్లాడు.
భర్త వ్యవహారశైలిపై శంకించిన భార్య.. అటువైపు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే.. కోనేరు ఉందని, అక్కడ స్నానం చేద్దామని వారిని నమ్మబలికాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత చిన్న కూతురు అక్షిత (2)ను గొంతు నులిమి చంపాడు. పెద్దమ్మాయి అంజలి (4)ని చంపేందుకు యత్నించగా.. భార్య అడ్డుకోబోయింది. దీంతో ఆమె మెడకు వైరు బిగించి హత్యాయత్నం చేయగా.. స్ఫృహ కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె లేచి చూసేసరికి భర్త, పెద్దపాప కానరాలేదు. వెంటనే ఇంటికి చేరుకున్న లక్ష్మి.. తన తల్లిదం డ్రుల సహాయంతో వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొడిమ్యాల, మల్యాల ఎస్‌ఐలు సోమ సతీష్‌కుమార్, నీలం రవి అడవిలో వెతకగా రాత్రి చిన్నారి అక్షిత శవం లభ్యమైంది. అశోక్‌తోపాటు మరో కూతురు అంజలి ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment