కన్నీళ్లను దిగమింగి.. కన్న కొడుకుకే ఉరి | Father Kills son, Then Hangs Himself | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 5 2018 12:04 PM | Last Updated on Wed, Dec 5 2018 4:15 PM

Father Kills son, Then Hangs Himself - Sakshi

కూతురు, భార్యతో మృతుడు విష్ణుమూర్తి.. హరిమణికంఠ సాయికుమార్‌(ఫైల్‌)

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): భార్యాపిల్లలతో ఆనందంగా జీవితం సాగిస్తున్న ఆ చిరు వ్యాపారితో విధి దోబూచులాడింది. అన్నీ తానై అండగా ఉంటాడనుకున్న కొడుకు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆ తండ్రి కుంగిపోయాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, ఎంత ఖర్చుపెట్టినా రోగం నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తండ్రి కన్నీళ్లను దిగమింగి కన్న కొడుకునే ఉరివేసి, అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా నున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.  

కొడుకును చూసి తట్టుకోలేకే..
ప్రకాష్‌నగర్‌లో కూల్‌డ్రింక్‌ షాప్‌ వ్యాపారి అయిన సూరాబత్తుల విష్ణుమూర్తి(40)కి విజయలక్ష్మీ అనే మహిళతో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి హరిమణికంఠ సాయికుమార్‌(22) అనే కుమారుడు, భవాని అనే కూతురు ఉన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికుమార్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు చేయించగా రక్తప్రసరణ ఆగిపోయిందని చెప్పారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా వ్యాధి నయం కాలేదు. సుమారు రూ.20 లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. చేతికందిన కొడుకు మంచానికే పరిమితం కావడంతో విష్ణుమూర్తి కుంగిపోయాడు. దీంతో మంగళవారం ఇంట్లో భార్య, కుమార్తె లేని సమయంలో కొడుకుకు ఉరివేసి, అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పులన్నీ తీర్చి.. అదే రోజు మృత్యుఒడికి
కొడుకు వైద్యం కోసం తీసుకున్న అప్పులన్నీ విష్ణుమూర్తి ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చేశాడు. చనిపోయే ముందు కూడా కొంతమందికి అప్పు చెల్లించాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన భర్త, కుమారుడిని చూసి భార్య విజయలక్ష్మి, కూతురు భవాని కన్నీరుమున్నీరయ్యారు.  విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement