
ప్రియా థియేటర్
కోల్‌కతా : వీకెండ్ అని సరదాగా సెకండ్ షో మూవీకి వెళ్లిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. థియేటర్‌ను మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఎట్టకేలకు సురక్షితంగా బయట పడటంతో కథ సుఖాంతమైంది.
నటుడు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అరిజిత్ దత్తాకు దక్షిణ కోల్‌కతాలో ప్రియా థియేటర్ ఉంది. అయితే ఆదివారం రాత్రి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సెకండ్ షో మూవీ చూస్తున్నారు. ఇంతలో థియేటర్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రేక్షకులు ప్రాణభయంతో ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాజెక్టర్ రూమ్ టెక్నీషియన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మరోవైపు మెట్లమార్గం ద్వారా ప్రేక్షకులను సురక్షితంగా బయటకు రప్పిస్తూనే.. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. దీంతో థియేటర్ యాజమాన్యంతో పాటు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
దాదాపు రాత్రి 10:15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించినా.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా తగిన సమయంలో స్పందించి చర్యలు తీసుకున్న అగ్నిమాపక సిబ్బంది కోల్‌కతా మేయర్ సోవన్ చటర్జీ ప్రశంసించారు. కాగా, థియేటర్ యజమాని అరిజిత్ దత్తా కుటుంబసభ్యులు సైతం ఆ సమయంలో థియేటర్‌లో ఉన్నారని మేనేజర్ తెలిపాడు. 1959 నుంచి థియేటర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు చెప్పాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పై అంతస్తులో ఉన్న సినిమా హాల్‌కు వ్యాపించగానే పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment