సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వినోదాన్ని పంచే.. ఎగ్జిబిషన్‌లో పరిస్థితి విషాదకరంగా మారింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) అగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న స్టాళ్లను బూడిద చేశాయి. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే.. ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధృతంగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా సుమారు ఏడుగురు అస్వస్థతకు గురవడంతో.. వీరికి సమీపంలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. ఆస్తి నష్టం మాత్రం వందల కోట్లలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా. దాదాపు 400 స్టాళ్లు బూడిదయ్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. రాత్రి 10.30 గంటల వరకు కూడా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగిలిన స్టాళ్లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
7.30గంటల సమయంలో..
ఎప్పటిలాగే.. మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అయితే.. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వనితా మహావిద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన జైళ్లు, ఆంధ్రాబ్యాంక్ స్టాళ్ల సమీపం నుంచి మంటలు మొదలయ్యాయి. సందర్శకులు, స్టాళ్ల యజమానులు చూస్తుండగానే.. ఈ మంటలు గాంధీ విగ్రహం సమీపంలోని హెచ్‌పీ గ్యాస్, పిస్టా హౌజ్ స్టాళ్ల మధ్య, వీటికి ఎదురుగా ఉన్న స్టాళ్లకు వ్యాపించాయి. వీటిలో చేనేత, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల స్టాళ్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు జైళ్లు, ఆర్బీఐ, ఆంధ్రాబ్యాంక్, రియల్ ఎస్టేట్ స్టాళ్లన్నీ దగ్ధమయ్యాయి. కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి స్టాళ్లలోని చిన్న గ్యాస్ సిలిండర్లు (వారు వంట వండుకునేవి) పేలిపోయి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
కలకలం
మంటలు క్షణాల్లోనే పెరిగిపోతుడడంతో స్టాళ్ల యజమానులతోపాటు అక్కడికొచ్చిన సందర్శకుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఎటుపోవాలో అర్థంకాక.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెరోపక్కకు పారిపోయే ప్రయత్నం చేయడంతో.. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది కిందిపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఆహ్లాదకరంగా ఉన్న ఎగ్జిబిషన్‌లో పరిస్థితి క్షణాల్లోనే భయానకంగా మారడంతో.. బయట నుండి రావాల్సిన సందర్శకులను నిలిపేయటంతో పాటు, లోపల ఉన్న సందర్శకులు సైతం పిల్లా పాపలతో గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్ల వైపు పరుగులు తీశారు. సాయంత్రం ఏడు గంటల నుండి పదిన్నర గంటల వరకు చెలరేగిన అగ్నికీలల్లో సుమారు 400 స్టాళ్లు పూర్తిగా దహనం అయ్యాయి. దీంతో ఆస్తినష్టం వందల కోట్లలో ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనాకు వచ్చారు.
అరగంట తర్వాత వచ్చిన ఫైరింజన్
తొలుత నిప్పురవ్వలు వచ్చి మంటలు అంటుకోగానే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమయంలో నుమాయిష్ గేటు బయటే ఉన్న ఫైరింజన్ లోపలకు వచ్చేందుకు 28 నిమిషాల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తూ.. అందులోనూ మంటలార్పేందుకు సరిపోయేన్ని నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం విషయమై ఉన్నతాధిరులు జోక్యం చేసుకుని సుమారు 18 ఫైరింజన్లు పంపినా.. రాత్రి పదిన్నర గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్‌లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన తర్వాత.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి వెళ్లిపోయే సందర్శకుల కోసం అర్థరాత్రి వరకు ఉచితంగా మెట్రో రైళ్లను నడిపారు.
నష్టపరిహారం కోసం ఆందోళన
మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీకి స్టాళ్ల యజమానుల నుండి నిరసన ఎదురైంది. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని హోంమంత్రిని చుట్టుముట్టి, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఒక దశలో పోలీస్‌లు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కొందరు ప్రతినిధులు మహమూద్ అలీతో సమావేశమై తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా హోంమంత్రి వారికి భరోసా ఇచ్చారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జనవరి 1న ప్రారంభమైన 79వ పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను 23 ఎకరాల్లో 2900 స్టాళ్లతో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు సాగే ఈ ఎగ్జిబిషన్‌ను సుమారు 25–30లక్షల మంది సందర్శిస్తారు. జైళ్లు, అటవీశాఖలతో పాటు జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి చేతివృత్తి కళాకారుల రూపొందించే వస్త్రాలు, కళాఖండాలకు సంబంధించిన స్టాళ్లున్నాయి.
కళ్లముందే కాలిపోయాయి: అక్బర్ అలీ
మేం ప్రతి ఏటా స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. ఈ యేడు పోచంపల్లితో పాటు ఇతర చేనేత వెరైటీలతో నాలుగు స్టాళ్లు ఏర్పాటు చేశాము. తొలుత ఆంధ్రాబ్యాంక్ స్టాల్ పక్క స్టాల్‌నుండి చెలరేగిన మంటలు చూస్తుండగానే విస్తరించాయి. నా స్టాళ్లలోని సుమారు 60 లక్షల విలువైన వస్త్రాలు దహనం అయ్యాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు.
ఫైరింజన్ల ఆలస్యం: చింతాడ గోవర్ధన్, పోచంపల్లి
ఫైరింజన్లు సకాలంలో వచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు. మేం ఫోన్ చేసిన చాలా సేపటికి ఫైరింజన్లు వచ్చాయి. పోచంపల్లి ఖాదీతో మేం ఏర్పాటు చేసిన స్టాళ్లు చూస్తుండగానే కాలిపోయాయి. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం మినహా.. మరేం చేయలేకపోయా. నాకు సుమారు 7 లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్య తప్పదు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం
Published Wed, Jan 30 2019 9:10 PM | Last Updated on Thu, Jan 31 2019 12:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment