
ప్రతీకాత్మక చిత్రం
పనిముగించుకొని తిరిగి వెళ్తుండగా.. అనుమానాస్పంగా సంచరిస్తున్నారనే కారణంగా
శ్రీనగర్: గోరక్షకుల పేరుతో అమాయకులను పెట్టుకుంటున్న ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కశ్మీర్‌లో పశువుల వ్యాపారులపై భద్రతా దళాలు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం 4 గంటలకు రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. గూల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీక్ గుజ్జార్ (28), షకీల్ అహ్మద్ (30) పశువుల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటారు.
వ్యాపారం నిమిత్తం కోహ్లి అనే గ్రామానికి శనివారం రాత్రి వచ్చారు. పనిముగించుకొని తిరిగి వెళ్తుండగా.. అనుమానాస్పంగా సంచరిస్తున్నారనే కారణంగా రాష్ట్రీయ రైఫిల్స్ 58 బెటాలియన్‌కు చెందిన సైనికులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గుజ్జార్ ఘటనా స్థలలోనే చనిపోయాడు. షకీల్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామనీ, దర్యాప్తు జరగుతోందని జిల్లా ఎస్పీ మోహన్ లాల్ వెల్లడించారు.