కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో తీసిన గుంతలు ఐదుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కన్నారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నారం గ్రామానికి చెందిన ఖాజా హసన్‌అలీ జీహెచ్ ఎంసీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు ఖాజా ఇంతియాజ్ అలీ (41) సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు.
నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి న ఆయన మంగళవారం తండ్రి, భార్య, ముగ్గురు పిల్లలతో కలసి కన్నారానికి వచ్చాడు. కాగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంనగర్‌లో ఉండే అతని బావమరిది మహ్మద్ ఆసిఫ్, మరికొంతమంది బంధువులు కూడా కన్నారం గ్రామానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి ఊరిలో ఉన్న పెద్దచెరువు సమీపానికి వెళ్లారు. ఖాజా ఇంతియాజ్ అలీ కొడుకులు ఇసాక్‌అలీ (12), హైమద్‌అలీ (9), మహ్మద్ ఆసిఫ్ (30), హుదా ఖరీమా(16) అనే బంధువు, వీరితోపాటు వచ్చిన బంధువుల పిల్లలు జియాద్ ఖాదిర్, ఫాతిమా చెరువులో ఈత కొట్టేందుకు దిగారు.
ఈ సమయంలో ఇంతియాజ్ అలీ, అతని బావమరిది ఆసిఫ్ చేపలు పట్టేందుకు గాలాలు వేస్తున్నారు. కొంత సేపటికి ఇసాక్‌అలీ, హైమద్‌అలీ, హుదా ఖరీమా ఈతకొడుతూ చెరువు లోపలికి వెళ్లారు. వీరు వెళ్లినచోట పెద్ద గుంత ఉండటంతో అందులో మునిగిపోయారు. అది గమనించిన మహ్మద్ ఆసిఫ్, ఇంతియాజ్ అలీ వారిని రక్షించే ప్రయత్నంలో చెరువులోపలికి వెళ్లగా వారు కూడా మునిగి పోయారు.
గట్టుపై ఉన్నవారు అరవడంతో వారి డ్రైవర్ సుబాన్ అలీ చెరువులో మునుగుతున్న ఇద్దరు పిల్లలను అతికష్టం మీద కాపాడాడు. మిగతావారు మునిగిపోయారు. సాయం కోసం ప్రయత్నించగా, బంధువులు, గ్రామస్తులు వచ్చేలోపు ఐదుగురు మృత్యువాత పడ్డారు. తండ్రితోపాటు ఇద్దరు కొడుకులు, బావమరిది, వదిన కూతురు.. మొత్తం అయిదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment