దారికాసిన మృత్యువు | Five People Died in Auto Accident | Sakshi
Sakshi News home page

దారికాసిన మృత్యువు

Published Thu, Mar 7 2019 8:18 AM | Last Updated on Thu, Mar 7 2019 8:18 AM

Five People Died in Auto Accident - Sakshi

లావణ్య(ఫైల్‌) ప్రవల్లిక(ఫైల్‌) లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన ఆటో

తూర్పుగోదావరి, రంపచోడవరం/నెల్లిపాక: నిరుద్యోగ భృతి అందుతుందని, తమకు కొంత ఆర్థిక చేయూత లభిస్తుందని ఆశపడిన ఆ యువతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. రంపచడవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలం గౌరీదేవీపేటకు చెందిన తానికొండ ప్రవల్లిక (24), తోటపల్లి గ్రామానికి చెందిన సూదిపాక లావణ్య( 24), గన్నవరానికి చెందిన  ములిశెట్టి ప్రశాంత్‌(26) మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన యువతులు యువనేస్తం పథకంలో భాగంగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వీరి సర్టిఫికెట్స్‌ పరిశీలన కోసం బుధవారం ఉదయం గన్నవరం నుంచి ఆరు గంటలకు ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. వీరితో పాటు గన్నవరానికి చెందిన గంజి వీరబాబు, తోటపల్లి గ్రామానికి చెందిన జి రమేష్‌ కూడా ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. రంపచోడవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సీతపల్లి గుడి సమీపంలో మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, లావణ్య, ప్రశాంత్‌లను ప్రైవేట్‌ వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సరికే ప్రవళిక, లావణ్యలు మృతి చెందారు. ప్రశాంత్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మలుపు వద్ద పొంచి ఉన్న మృత్యువు
సీతపల్లి పాత రోడ్డు, కొత్త రోడ్డు కలిసే జంక్షన్‌ వద్ద మృత్యువు పొంచి ఉంది. మంగళవారం రెండు వాహనాలు ఢీకొనడంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా బయట పడ్డారు. అయితే బుధవారం జరిగిన ప్రమాదంతో ఇదే మలుపులో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గోకవరం నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ సీతపల్లి గుడి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వెనుక భాగాన్ని ఢీకొనడంతో వెనుక సీటులో ఉన్న ముగ్గురి తలలకు  తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న  ఇద్దరు యువకులు రమేష్, వీరబాబులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

గ్రామాల్లో విషాదఛాయలు
ఎటపాక మండలంలోని మూడు గ్రామాలకు చెందిన యువతులు, యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిరుద్యోగ భృతి కోసం వెళుతూ మృత్యువాత పడడంతో వారు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రశాంత్‌ ఆటో నడుపుతూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడని తలచుకుని రోదిస్తున్నారు. మృతి చెందిన వారిని ప్రభుత్వపరంగా అదుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ కోరారు. అలాగే రంపచోడవరం ఏరియా మార్చురీలో ఉన్న యువతుల మృతదేహాలను భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement