
మల్కాజిగిరి: కారు యజమాని నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పటి వరకు ఉరుకులు..పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉన్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలం వదావత్ గ్రామానికి చెందిన రంగప్ప బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని వెంకటసాయి ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నెల రోజుల క్రితం వాచ్‌మెన్‌గా చేరాడు. ఇతనికి పెద్ద కుమారుడు తరుణ్(5), మరో నెలల బాబు ఉన్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మనోహర్ అనే వ్యక్తి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం బయట నుంచి వచ్చిన మనోహర్ తన మారుతీ వాగనార్ కారును అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఆడుకుంటున్న తరుణ్‌ను గమనించకపోవడంతో కారు అతని మీద నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన తరుణ్‌ను వెంటనే తల్లిదండ్రులు, అపార్ట్‌మెంట్ వాసులు మనోహర్ కారులోనే స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకు వెళ్లగా...వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తరుణ్ తండ్రి ఫిర్యాదు చేయడంతో 304 ఎ ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.