జైపూర్ సెంట్రల్ జైలు
జైపూర్ : రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలులో పాకిస్తాన్ ఖైదీ షకూరుల్లా ఫిబ్రవరి 20న దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతంపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. షకూరుల్లాపై దాడి చేసి హతమార్చిన నలుగురిని విచారణ నిమిత్తం ప్రొడక్షన్ వారెంట్‌తో అరెస్టు చేశారు. టీవీ వాల్యూమ్ విషయంలో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారితీసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. భజన్, అజిత్, కుల్విందర్, మరో వ్యక్తి అరెస్టయిన వారిలో ఉన్నారు. (జైపూర్ సెంట్రల్ జైలులో పాక్ ఖైదీ దారుణ హత్య)
జైపూర్ ఏఎస్పీ లక్ష్మణ గౌర్ తెలిపిన ప్రకారం.. టీవీ చూస్తున్న ఐదుగురు ఖైదీల మధ్య వాల్యూమ్ విషయంలో వివాదం మొదలైంది. దీంతో అక్కడ తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మిగతా నలుగురు ఖైదీలు పాక్ ఖైదీ షకూరుల్లాను బండకేసి బాదారు. తలకు తీవ్ర గాయం అవ్వడంతో అతను ప్రాణాలు విడిచాడు. తొలుత పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
షకూరుల్లా పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ ప్రాంతానికి చెందిన వాడు. గూఢచర్యం కేసులో 2011లో అరెస్టయి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కాగా, జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల భద్రత విషయమై ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తగు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ సూచిందింది. భారత్ జైళ్లలో 347 మంది పాకిస్తాన్ ఖైదీలు శిక్షను అనుభవిస్తుండగా.. పాక్ జైళ్లలో 537 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment