
ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
బత్తలపల్లి: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన దంపతులు సాకే నారాయణస్వామి (45), సాకే ఆదెమ్మ (40) బొప్పాయి కాయలు అమ్ముకునేందుకు సొంత ఆటోలో రోజూ బత్తలపల్లికి వస్తుంటారు. రోజులాగే ఆదివారం తెల్లవారుజామున ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన చెన్నకేశవులు (46), పెద్దక్క (44) వ్యక్తిగత పనులపై వెళ్తూ అదే ఆటోలో ఎక్కారు.
ఆటో బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్దకు రాగానే బెంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా నారాయణస్వామి, ఆదెమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పిన్నదరి గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
ఘటన వివరాలు ..
ఎక్కడ?: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో
ఎప్పుడు?: ఆదివారం తెల్లవారుజామున
కారణం: లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడం
పర్యవసానం: ఆటోలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment