
వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో వ్యవహారం..
సాక్షి, మైలవరం : కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫేస్‌బుక్ వేదికగా యువతిని పరిచయం చేసుకున్న నిందితుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతేగాకుండా ఈ సంఘటనను మొబైల్‌లో చిత్రకరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వ్యవహారం బయటకు తెలిసింది.
లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బాధితురాలికి నిందితుడు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి వంచించాడు. ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ లాడ్జ్‌కి తీసుకు వచ్చి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా బాధితురాలు భయంతో విషయాన్ని బయటకు చెప్పలేదు. నిందితులు మణికంఠ, ధీరజ్, భాషాలుగా పోలీసులు గుర్తించారు. వీరి కోసం మూడు ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. బాధితురాలు సహకరిస్తే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా విచారించడానికి సన్నాహాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.