
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : గాజు బంతిని వజ్రంగా నమ్మించి అమ్మేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది నిందితులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేసి నకిలీ డైమండ్, కారు, రెండు బైక్‌లు, రూ.1,73,170/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఎల్‌బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా, రంగారెడ్డి జిల్లాల ప్రాంతానికి చెందిన మర్రి నర్సింహ (52), శ్రీరాం శ్రీనివాస్ (39), మచ్చ సాగర్ (31), కావలి రవీందర్ (28), బొడిగె వెంకటేష్ (41), గొడుగు లక్ష్మయ్య (45), కావలి శ్రీనివాస్ (39), గొడుగు నర్సింహ (38), ఆన్‌పాటి బాలజగదీష్ (30)లు ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తూ పాత దేవాలయాల వద్ద తిరుగుతుంటారు.
వీరు అత్తాపూర్‌కు చెందిన రవి అనే వ్యక్తి వద్ద డైమండ్ ఆకారంలో ఉండే గాజు బంతిని లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది చాలా ఖరీదైన వజ్రమని, ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరగుతాయని వారిని నమ్మించి రవి వారికి అంటగట్టాడు. వీరంతా కలిసి రహస్యంగా గాజు బంతిని అమ్మేందుకు తిరుగుతున్నారు. ఈ బంతి తవ్వకాల్లో లభించిందని ప్రజలను నమ్మించేందుకు యత్నించారు.
రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా ఇది దొరికిందని స్థానికులకు నమ్మబలికారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు నిందితులు స్కోడా కారులో వెళుతుండగా కొత్తగూడ క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు.
వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము ఈ గాజు బంతిని లక్ష రూపాయలకు కొనుగోలు చేశామని, అమ్మేందుకు తీసుకెళ్తున్నామని ఒప్పుకున్నారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి గాజు బంతి, కారు, నగదు, రెండు బైకులు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.
ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఓటీ సీఐ నవీన్, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్సై బాలు తదితరులు పాల్గొన్నారు.