హన్మకొండ చౌరస్తా: ప్రేమ పెళ్లి ఓ యువకుడికి శాపమైంది. కట్టుబాట్లను కాదని వివాహం చేసుకున్న ఆ జంటను ఇరువైపుల కుటుంబాలు బహిష్కరించాయి. గర్భవతైన ఆ ఇల్లాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పాపకు జన్మనిచ్చిన అనంతరం రక్తస్రావంతో మృతి చెందింది. అయితే జేబులో చిల్లిగవ్వ లేని ఆ భర్త, భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేని స్థితిలో సాయంకోసం 16 గంటలపాటు ఎదురుచూపులు చూశాడు. ఈ ఘటన ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపురం గ్రామానికి చెందిన మామిండ్ల ప్రేమ్‌కుమార్, మందమర్రికి చెందిన ప్రవళిక (21) ప్రేమించుకున్నారు. ప్రవళిక ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేశారు.
కూతురు పుట్టిన తర్వాతా ప్రేమ్‌కుమార్, ప్రవళికల మధ్య ప్రేమ చావలేదు. దీంతో భర్తను వదిలేసిన ప్రవళిక ప్రేమ్ వద్దకు చేరగా ఇద్దరూ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్‌కాలనీలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ప్రేమ్‌కుమార్ ట్రాక్టర్ నడుపుతూ భార్యను పోషించుకుంటున్నాడు. శనివారం ప్రసవ తేదీ కావడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు జీఎంహెచ్‌కు తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయడానికి రక్తం అవసరమని చెప్పడంతో ప్రేమ్ వరంగల్‌లోని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకు వెళ్లి ఒక బాటిల్ తీసుకొచ్చాడు.
ఒక బాటిల్ సరిపోదని మరోటి తేవాలని వైద్యులు చెప్పడంతో మరోసారి నగరంలోని బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎక్కడా రక్తం దొరక్కపోవడంతో ఆందోళనతో తిరిగి ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే ఆపరేషన్ ముగించిన వైద్యులు పాపకు జన్మనిచ్చిన ప్రవళిక సీరియస్‌గా ఉండడంతో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఆమె మృతి చెం దిందని సిబ్బంది ప్రేమ్‌కు తెలిపారు. జేబులో చిల్లిగవ్వ లేక, సాయంకోసం భార్య తల్లిదండ్రులతోపాటు తన కుటుంబానికి తెలియజేస్తే వారి నుంచి స్పందన రాలేదు. ప్రేమ్‌కుమార్‌కు ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది రూ.5 వేలు అందజేయగా ఆదివారం ప్రవళిక మృతదేహంతో ప్రేమ్ బయటకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment