బాలిక మేనమామ సోమరాజు ,బాలికను విశాఖ తరలిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది
బుచ్చెయ్యపేట (చోడవరం): శారీరక మార్పులను చుట్టుపక్కలవారు గమనిస్తున్నారు.. కడుపు అలా ఎత్తుగా ఉందేమిటమ్మా అని బాలికను ప్రశ్నిస్తున్నారు.. ఏదో సాకు చెప్పి అమ్మ సర్దిచెప్పేది.. ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాచేసేది.. అబార్షన్ చేయించేందుకు పలు ఆస్పత్రులకు తిప్పడంతో ఈ విషయం బయటపడింది. తమకు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన ఐసీడీఎస్ అధికారులు బాలికను బాలసదనానికి తరలించారు. మేనమామే బాలిక గర్భానికి బాధ్యుడు కాగా.. కుటుంబ సభ్యులు వెనకేసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐసీడీఎస్ అధికారులకు స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గౌరీపట్నం సోమరాజుకు ఆరేళ్ల క్రిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కలిగాక భార్య దేవితో విభేదాలు రావడంతో ఆమెను పుట్టింటికి పంపించేసి తన అక్క, బావ మాణిక్యం, చినబాబు ఇంట్లో మూడేళ్లుగా ఉంటున్నాడు.
ఎనిమిదో తరగతి చదివి ఇంట్లో ఉంటున్న మేనకోడలిని మాయమాటలతో వశపరుచుకున్నాడు. గతంలో రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించారు. మూడోసారి గర్భం తీయించడానికి విశాఖ, అనకాపల్లి, రావికమతం, చోడవరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఎనిమిదో నెల రావడంతో వైద్య సిబ్బంది నిరాకరించారు. బాలికలో మార్పులను ఇరుగుపొరుగు వారు గుర్తించి అడగడంతో.. కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సోమరాజుతోపాటు తల్లి మాణిక్యం గ్రామస్తుల్ని నమ్మించేవారు. బాలిక బయట ఎక్కువగా తిరగకుండా పొలాల్లో, తోటల్లో ఎక్కువగా ఉంచుతున్నారని, ఒకవేళ పురుడు అయితే పుట్టిన బిడ్డ ఎవరి కంట పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు గ్రామస్తులు గ్రహించి ఐసీడీఎస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. బాధితురాలు కిశోర బాలిక కావడంతో గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ పౌష్టికాహారం అందించేటపుడు ఆమె కడుపు చూసి అనుమానం వ్యక్తం చేసింది.
శుక్రవారం రావికమతం ఐసీడీఎస్ పీవో మంగతాయారు తమ సిబ్బందితో వచ్చి బాలిక వాడుతున్న ఆసుపత్రి మందులు, డాక్టర్లు రాసిన రిపోర్టులను పరిశీలించి ఆమెకు ఎనిమిదో నెలగా గుర్తించారు. తల్లి మాణిక్యాన్ని, మేనమావ సోమరాజును నిలదీయగా కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తిప్పుతున్నామని తప్పించుకోవడానికి చూశారు. ఐసీడీఎస్ సిబ్బంది వీరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలిక జరిగినదంతా ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీవో తన కారులో పెందుర్తి చైల్డ్ వెల్ఫేర్ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ చేర్చుకోవడానికి నిబంధనలు అడ్డు రావడంతో భీమిలిలోని బాలసదన్‌కు తరలించారు. పీడీ ఆదేశం మేరకు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, శనివారం ఉదయం తల్లిదండ్రులను పిలిపించి విచారించిన అనంతరం పీడీ తగు నిర్ణయం తీసుకుంటారని పీవో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment