
ప్రతీకాత్మకచిత్రం
లక్నో : ప్రియుడితో కలిసి జీవించేందుకు కిడ్నాప్, హత్య డ్రామా నడిపిన యువతి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. గోరఖ్‌పూర్‌లో నివసించే ఓ వ్యక్తి కుటుంబానికి మీ కుమార్తెను అపహరించి హత్య చేశామని మెసేజ్ రావడంతో వారి ఇంట విషాదం నెలకొంది. అయితే ఓ యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో అతనితో వెళ్లేందుకే బాధితుడి కుమార్తే ఈ డ్రామాను ఆడిందని పోలీసులు నిర్ధారించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ‘మీ కుమార్తె జీవితాన్ని అంతం చేసి ప్రతీకారం తీర్చుకున్నాం..చాలా నెలల తర్వాత వచ్చిన అవకాశం అందిపుచ్చుకుని ఆమె ఆఫీస్‌కు వెళుతుండగా హతమార్చాం..వీరు ఎలాంటి తండ్రంటే కనీసం మీకు ఆమె ఆనవాళ్లు కూడా మిగల్చలేద’ని తండ్రి అనిల్ కుమార్ పాండే మొబైల్‌కు కుమార్తె కాజల్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌తో పాటు యువతి గాయాలు, రక్తపు మరకలతో కనిపిస్తున్న ఫోటోలను ఉంచడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పోలీస్ విచారణలో కాజల్ డ్రామా బయటకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాజల్ మంగళవారం ఉదయం ఇంటినుంచి వెళ్లిందని, మొహరం పండుగ సెలవు గురించి అడగ్గా తనకు పనిఉందంటూ వెళ్లిందని ఆమె తండ్రి పాండే చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని అన్నారు. ఇక పోలీస్ విచారణలో కాజల్ ప్రేమ వ్యవహారం బయటపడింది. ప్రేమజంటను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన ఖాకీలు కాజల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఏడాది కిందట కాజల్‌కు ఆగ్రాకు చెందిన హరిమోహన్ ఓ డేటింగ్ యాప్‌లో పరిచమయ్యారు. డేటింగ్ యాప్‌లో మొదలైన వారి స్నేహం ప్రేమకు దారితీసిందని దర్యాప్తు అధికారి సుమిత్ శుక్లా వెల్లడించారు. ప్రేమికుల జంట కాల్ రికార్డులు, వారి మొబైల్ లొకేషన్ల ఆధారంగా ఈ కేసును ఛేదించామని చెప్పారు. కాగా తండ్రి వేధింపులు భరించలేక తాను ఇలా చేశానని, కుటుంబ సభ్యుల తీరుతో విసిగిన తాను బాయ్‌ఫ్రెండ్‌తో స్వేచ్ఛగా జీవించేందుకు ఆగ్రాకు పారిపోయేందుకే కిడ్నాప్, హత్య నాటకానికి తెరతీశామని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment