
ప్రమాదానికి కారణమైన కరెంటు వైరు మృతి చెందిన ఆదిలక్ష్మి, వెన్నెల
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు విన్నవించుకున్నా పెడ చెవినపెట్టారు. ఫలితంగా అవ్వ, మనవరాలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు.
తనకల్లు: ఉస్తినిపల్లికి చెందిన రిటైర్డ్ టీచర్ రామచంద్ర కొన్నేళ్లుగా తనకల్లులోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి ( చిన పాపాయమ్మ) ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసులుకు మోహన్, వెన్నెల అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాసులు తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలి బతకుదెరువు కోసం భార్య రమాదేవితో కలిసి బెంగుళూరుకు వెళ్లాడు. పిల్లలు మోహన్ నల్లచెరువు మోడల్ స్కూల్‌ల్లో తొమ్మిదో తరగతి చదువుతుండగా, వెన్నెల (13)అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. వెన్నెల బుధవారం పాఠశాలకు వెళ్లకుండా బట్టలు ఉతకాలనే ఉద్ధేశ్యంతో ఇంటి పట్టునే ఉంది. భోజనం చేసిన అనంతర తాను బట్టలు ఉతకడానికి పాత ఇంటి వద్దకు వెళ్లుతున్నానని చెప్పి వెళ్లింది. కొద్దిసేపటి తరువాత అవ్వ ఆదిలక్ష్మి (70) కూడా మనవరాలికి సాయంగా బట్టలు ఉతకడానికి వచ్చింది.
వీధిలైట్ వైరు తగిలి..విద్యుదాఘాతం
ఉతికిన బట్టలను కరెంట్ స్తంభానికి ఇంటికి కట్టిన జీఏ వైరు (ఇనుప వైరు) పైన వేయడానికి వెన్నెల వెళ్లింది. వీధిలైటుకు సంబంధించిన విద్యుత్ తీగ కిందకు వేలాడుతోంది. గాలికి ఆ తీగలు ఇనుప వైరుకు తాకుతోంది. ఇది తెలియని వెన్నెల బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ కొట్టడంతో గట్టిగా అరించింది. గమనించిన అవ్వ కాపాడేందు కోసం వెన్నెలను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విగతజీవులై పడిఉన్న అవ్వ, మనవరాలిని చూసి బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
లైన్‌మెన్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
ట్రాన్స్‌కో లైన్‌మెన్ల నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ప్రమాదకరంగా ఉన్న కరెంట్ వైర్లను తొలగించాలని లైన్‌మెన్లకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరానగర్‌లో ఇళ్లపై విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉన్నాయని, తొలగించాలని కోరితే డబ్బు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన లైన్‌మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment