
అకారణంగా తమపై దాడి జరిగింది. ఇక ఎంతమాత్రం ఇక్కడ ఉండలేం.
గురుగ్రామ్ : క్రికెట్ ఆడుతున్న ముస్లిం కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ‘ఇక్కడ క్రికెట్ ఆడొద్దు. కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఆడుకోండి’ అంటూ సాజిద్ కుటుంబాన్ని హెచ్చరించడంతో పాటు కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. గురుగ్రామ్‌లో హోలీ (గురువారం) రోజున ఈ ఘటన జరిగింది. సాజిద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అకారణంగా తమపై దాడి జరిగిందని, ఇక ఎంతమాత్రం ఇక్కడ ఉండలేమని సాజిద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా సొంతూరికి లేదా ఢిల్లీకి వెళ్లిపోదాం అనుకుంటున్నాం. అకారణంగా మాపై విచక్షణారహితంగా దాడి చేశారు. మాకు మద్దతుగా మాట్లాడానికి ఇక్కవ మాకెవరూ లేరు. చుట్టుపక్కల వారు న్యాయం మాట్లాడడానికి ముందుకురావడం లేదు. ఈ ఇల్లు నా కళ. కష్టార్జితంతో కట్టుకున్నా. అయినప్పటికీ ఇక ఇక్కడ ఉండాలనుకోవడం లేదు’ అని సాజిద్ వాపోయాడు. గురుగ్రామ్‌లోని గోస్లాలో ఆయన ఫర్నిచర్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
(‘క్రికెట్ ఆపెయ్యండి .. కావాలంటే పాకిస్తాన్ వెళ్లిపోండి’)
‘మా ఇంటిని ఆనుకుని ఉన్న ఫ్లాట్ ఆవరణలో క్రికెట్ ఆడుతున్నాం. అక్కడికి కొందరు యువకులు వచ్చారు. ఇక్కడేం చేస్తున్నారు. ఆటలు ఆపండి. కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఆడుకోండి అని హెచ్చరించారు. మామయ్య వారితో మాట్లాడుతుండగానే ఆయనపై దాడికి దిగారు’ అని సాజిద్ మేనల్లుడు దిల్షాద్ చెప్పాడు. హోలీ సందర్భంగా మామయ్య ఇంటికి వస్తే ఇంతటి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత సాజిద్‌పై దాడి చేసిన దుండగులు అనంతరం మరికొంతమందితో కలిసి కర్రలు, రాడ్లతో వారి ఇంట్లోకి చొరబడి మరలా దాడికి దిగారు. సాజిద్ కుటుంబ సభ్యులను చితకబాదారు. ఫర్నీచర్, బంగ్లా అద్దాలు ధ్వంసం చేశారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా.. తమపై దాడిచేసిన వారెవరూ స్ధానికులు కాదని, వారిని ఆ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని సాజిద్ తెలిపారు. ‘మా వాళ్లను కొట్టొద్దని కాళ్లావేళ్లా పడి బతిమాలినా ఎవరూ కనికరించలేదు. కర్రలు, రాడ్లతో తీవ్రంగా కొట్టారు. వాళ్లను అడ్డుకునే క్రమంలో నా భుజం, మోకాలు భాగంలో గాయాలయ్యాయి’ అని సాజిద్ భార్య సమీరా చెప్పారు. భోండ్సీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Every Patriotic Indian is disgusted by the video of a family in #Gurugram being mercilessly beaten by hooligans. The RSS/ BJP channelises bigotry & hatred for political power. This incident serves as a warning of the dangerous consequences & the dark side of that strategy.
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2019