సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదట. తాజాగా మరోసారి ఫిర్యాదు చేసిన ఆమె ప్రయోజనం లేదని భావించారు. పోలీసులు తనకు న్యాయం చేయరని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెలుగింటి ఆడపడుచుకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె పోస్టులో ఏం పేర్కొన్నారంటే..
నాపేరు హరిణికుమారి. తెలప్రోలు గ్రామ సర్పించ్‌ని(టీడీపీ). నా భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యూత్ లీడర్. గతేడాది నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనిపై గతేడాది గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో బాధితురాలు హరిణికుమారి కోరారు.
చెత్త రాజకీయ నాయకుడ్ని మీరు సమర్థిస్తారా?
‘టీడీపీ యూత్ లీడర్ ఓ బుకీ, పేకాటరాయుడు, అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇలాంటి రాజకీయనాయకుల వల్ల మాకు పోలీస్‌స్టేషన్లలో కూడా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ పోస్టును షేర్ చేయండి. బాధితురాలు మీ సోదరి’ అని హరిణికుమారి మరో పోస్ట్‌లో భర్త వ్యసనాలు, దురలవాట్లను బయటపెట్టారు. భర్త ఫొటోను షేర్ చేస్తూ కనబడటం లేదని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలని బాధిత మహిళా సర్పంచ్ కోరారు.
ఫేస్‌బుక్‌లో మహిళా సర్పంచ్ హరిణికుమారి పోస్టులు
Comments
Please login to add a commentAdd a comment