సాక్షి సబ్‌ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్‌ పిడిగుద్దులు | Head Constable Attack On Sakshi Sub Editor In Karimnagar | Sakshi
Sakshi News home page

సాక్షి సబ్‌ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్‌ పిడిగుద్దులు

Published Sun, May 12 2019 8:05 AM | Last Updated on Sun, May 12 2019 8:05 AM

Head Constable Attack On Sakshi Sub Editor In Karimnagar

కరీంనగర్‌క్రైం: సాక్షి దినపత్రికలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు సబ్‌ ఎడిటర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పద్మారావు, అతడి కుమారుడు దిలీప్‌ అకారణంగా అడ్డగించి జులుం ప్రదర్శించారు. ‘ఇది మా ఏరియా.. ఎవరూ రాకుడదు.. నేను పోలీసు..’ అంటూ దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటన కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్‌ వన్‌టౌన్‌ సీఐ తుల శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెవుల రాములు, తన్నీరు వెంకటేశ్‌ తిమ్మాపూర్‌లోని సాక్షి యూనిట్‌ కార్యాలయంలో సబ్‌ ఎడిటర్లుగా పని చేస్తూ కరీంనగర్‌ కోతిరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి కోతిరాంపూర్‌లో ఆఫీసు బస్సు దిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో అతిగా మద్యం సేవించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావు కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులు ఇంటి బయట ఉన్నారు.

రాములు, వెంకటేశ్‌లను అడ్డగించి ‘ఇది మా ఏరియా మీరు ఎవరు.. ఎందుకు వచ్చారు.. అంటూ దబాయించారు. సాక్షి దినపత్రికలో సబ్‌ ఎడిటర్లుగా పని చేస్తున్నామని, ఆఫీసు నుంచి వస్తున్నామని చెప్పారు. అయినా వినిపించుకోకుండా గుర్తింపు కార్డులు చూపించాలంటూ బెదిరించారు. వెంకటేశ్‌ గుర్తింపుకార్డు చూపించగా... గుర్తింపుకార్డులు మీకెందుకు చూపించాలని రాములు ప్రశ్నించడంతో దిలీప్‌ అకారణంగా దూషిస్తూ ‘మా నాన్న పోలీసు’ అంటూ కాలర్‌ పట్టుకుని దాడి చేశాడు. ఇక్కడ విద్యుత్‌ స్తంభానికి కట్టేస్తామంటూ కొట్టుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావు ‘నేను పోలీసును రా ఎవరినైనా తంతా..’ అంటూ నోటికి వచ్చినట్లు దూషించి పిడిగుద్దులు కురిపించాడు.

రాములు ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. రాములు వారి నుంచి తప్పించుకుని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావు, అతడి కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్‌ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, తమపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్‌ 100కు సమాచారం అందించినా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ సరిగా స్పందించలేదని బాధితులు తెలిపారు. పైగా హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావుకు మద్దతుగా మాట్లాడుతూ నీవు ఎందుకు వెళ్లావని నన్నే దబాయించాడని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు.

హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయాలి..
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సాక్షి సబ్‌ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావు, అతని కుమారుడు దిలీప్, బంధువులు అకారణంగా దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే కరీంనగర్‌ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. వెంటనే నిందితులపై చర్య తీసుకోవాలని, పద్మారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుని, జర్నలిస్ట్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం బాధ్యులు వన్‌టౌన్‌ సీఐ తుల శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. సీఐని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్‌రావు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, సాక్షి కరీంనగర్‌ బ్యూరో ఇన్‌చార్జి ఆంజనేయులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement