
సాక్షి, సేలం (తమిళనాడు): నీళ్ల కుళాయి వద్ద దౌర్జన్యం చేసిన ఓ రౌడీని పది మందికిపైగా మహిళలు రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈరోడ్ జిల్లాలోని సిత్తోడు ఆర్‌ఎన్ పుదూర్ మాదేష్‌వరా నగర్‌కు చెందిన సెల్వం(38)పై పలు స్టేషన్లలో అనేక కేసులున్నాయి. ఓ హత్య కేసులో జైలు శిక్ష పడి రెండేళ్ల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం తాగునీటి కుళాయి వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటుండగా సెల్వం అక్కడికి వెళ్లాడు. కుళాయి కిందనున్న బిందెను పక్కకు తీసి నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్నవారు సెల్వంతో గొడవ పడ్డారు.
ఆగ్రహానికి గురైన సెల్వం.. రంగనాథన్ అనే వ్యక్తి చేతిని కత్తితో నరికాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలంతా సెల్వంపై మూకుమ్మడిగా దాడికి దిగారు. రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో చితకబాదారు. సెల్వాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment