
హోంగార్డుగా పనిచేస్తున్న అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు. చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబం. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి బయల్దేరాడు. వెళ్లే ముందు భార్యాపిల్లలతో కాసేపు సరదాగా గడిపాడు. టాటా.. బైబై.. అంటూ ముగ్గురికీ వీడ్కోలు చెప్పాడు. అదే తుది వీడ్కోలు అవుతుందని వారిలో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే.. అతడు ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు.
సాక్షి, రఘునాథపాలెం : మండలంలోని వీవీపాలెం వద్ద ఖమ్మం–వైరా ప్రధాన రోడ్డుపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ జి.వెంకటరమణ(38) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ గోపి తెలిపిన వివరాలు.. కొణిజర్లకు చెందిన వెంకటరమణ, ఖమ్మంలో ట్రాఫిక్ పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారమవడంతో పెద్ద కూతురు ఇంటి వద్దనే ఉంది. ఇద్దరు పిల్లలతో ఉదయం నుంచి సరదాగా గడిపాడు. మధ్యాహ్న భోజనానంతరం రెండు గంటల సమయంలో డ్యూటీకని తన ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. పది నిముషాల్లో వీవీపాలెం గ్రామ సమీపంలోకి వచ్చాడు. అక్కడ, ఖమ్మం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వెంకటరమణ మృతితో తోటి హోంగార్డులు, పోలీసులు విషాదంలో మునిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి ఎస్‌ఐ గోపి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సీపీ, ఏసీపీ సందర్శన
వెంకటరమణ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏఆర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సీఐ నరేష్‌రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ తిరుపతిరెడ్డి సందర్శించారు. విచారం వ్యక్తం చేశారు. విలేకరులతో సీపీ మాట్లాడుతూ.. హోంగార్డ్ వెంకటరమణ కుటుంబాన్ని పోలీస్ శాఖ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ఎగిరిపడిన హెల్మెట్
ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు వెంకటరమణ హెల్మెట్ ధరించాడు. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో హెల్మెట్ ఎగిరిపడింది.
నేత్రాలు దానం
ఇంతటి విషాదంలోనూ వెంకటరమణ కుటుంబీకులు ఔదార్యం చాటుకున్నారు. తమ ఇంటి పెద్ద కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అతడి తండ్రి నాగయ్యను, కుటుంబీకులను ట్రాఫిక్ సీఐ పి.నరేష్‌రెడ్డి ఒప్పించారు.
కొణిజర్లలో విషాద ఛాయలు
కొణిజర్ల: కొణిజర్ల ఎస్సీ కాలనీకి చెందిన హోంగార్డ్ గొడ్డుగొర్ల వెంకటరమణ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. పదేళ్ల నుంచి హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటరమణకు సౌమ్యుడిగా గ్రామంలో మంచి పేరుంది. తల్లిదండ్రులైన నాగయ్య–వరాలు దంపతులకు ఇతడు ఒక్కగానొక్క కొడుకు. తామిద్దరిని, భార్యాపిల్లలను వదిలేసి, అప్పుడే వెళ్లిపోయావా.. అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘‘రోజూ నన్ను చూడనిదే అన్నం కూడా తినడు’’ అంటూ, భార్య సంధ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇద్దరు పిల్లల్లో కావ్యాంజలి.. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. చిన్న పాప వయసు మూడేళ్లు.