కట్నం కోసమే కాల్చాడు! | Husband Attack On Wife With Gun In Karimnagar | Sakshi
Sakshi News home page

కట్నం కోసమే కాల్చాడు!

Published Sun, Aug 5 2018 7:42 AM | Last Updated on Sun, Aug 5 2018 7:44 AM

Husband  Attack On Wife  With Gun In Karimnagar - Sakshi

నిందితులను అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు(ఇన్‌సెట్‌లో)

అల్గునూర్‌ (కరీంనగర్‌):  తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో శుక్రవారం రాత్రి భార్యపై కాల్పులు జరిపిన భర్త కనుకయ్యను ఎల్‌ఎండీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాల్పులు జరిపేలా కనుకయ్యను ప్రేరేపించిన నిందితుడి తల్లిదండ్రులు రాజసాబు–చంద్రమ్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేసన్‌లో సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై నరేశ్‌రెడ్డి నిందితులను అరెసూచించారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన ఊబిది కనుకయ్యకు అదే గ్రామానికి చెందిన స్వప్నను 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో స్వప్న తల్లిదండ్రులు రూ.2 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకున్నారు.. అయితే రూ.లక్ష మాత్రమే అప్పగించారు. మిగతా లక్ష  తర్వాత ఇస్తామని స్వప్ప తండ్రి కనుకయ్య తండ్రికి రాజాసాబుకు ప్రమిసరీ నోటు రాసి ఇచ్చాడు.  ఐదేళ్లు గడిచినా ఒప్పుకున్న కట్నం రాకపోవడంతో తరచూ కనుకయ్యతోపాటు తల్లిదండ్రులు చంద్రమ్మ, రాజసాబు స్వప్నను కట్నం డబ్బులు తేవాలని వేధిస్తున్నారు.
 
ఉపాధి కోసం నేపాల్‌కు... 
స్థానికంగా ఉపాధి లేకపోవంతో పెళ్లయిన ఏడాదికే భార్యాభర్తలిద్దరూ నేపాల్‌ వెళ్లారు. అక్కడ  పాత ఇనుప సామాను కొనుగోలు, పేపర్లు కొంటూ అక్కడ ఉపాధి పొందుతున్నారు. ఆరు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి నెల రోజులు ఇక్కడే ఉండి మళ్లీ నేపాల్‌ వెళ్లారు. ఈక్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం స్వప్న మళ్లీ గర్భం దాల్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కనుకయ్య స్వగ్రామానికి వచ్చాడు. స్థానికంగా పనిచేసుకుంటున్నాడు. స్వప్న రెండు రోజుల క్రితం నేపాల్‌ నుంచి స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో కనుకయ్య కట్నం డబ్బులు తీసుకురావాలని  స్వప్నను పుట్టింటికి పంపించాడు. ఆమె తల్లిదండ్రులు వద్ద డబ్బులు లేకపోవడంతో వట్టి చేతులతో స్వప్ప శుక్రవారం అత్తవారింటికి వచ్చింది.

దీంతో కోపోద్రిక్తులైన చంద్రమ్మ–రాజాసాబు దుర్భాషలాడారు. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కనుకయ్యకు విషయం చెప్పారు. ‘కట్నం తేని భార్య నీకెందుకు.. చంపేయ్‌. అవసరమైతే కట్నం తెచ్చే పిల్లను మళ్లీ పెళ్లిచేస్తాం అని’ అని హత్యకు ప్రేరేపించారు. దీంతో కోపోద్రిక్తుడైన కనుకయ్య భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగడంతో అప్పటికే తాను నేపాల్‌ నుంచి రహస్యంగా తెచ్చుకున్న గన్‌ను తీసుకొచ్చి స్వప్నపై కాల్పులు జరిపాడు. ఒక రౌండ్‌ కాల్చగానే తుపాకీ శబ్దం రావడంతో స్థానికంగా ఉన్నవారు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి ఆందోళన చెందిన కనుకయ్య గన్‌ అక్కడే వదిలి పారిపోయాడు. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కనుకయ్య తల్లిదండ్రులు చంద్రమ్మ–రాజాసాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనుకయ్యను పట్టుకున్నారు. రాత్రంతా విచారణ చేశారు.
 
సంఘటన స్థలంలో పోలీసుల విచారణ
కనుకయ్య ఇచ్చిన సమాచారం మేరకు రామకృష్ణకాలనీలోని అతని ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇంటి సమీపంలోని మురు గు కాలువలో ఏఎస్సై మధుసూదన్‌రెడ్డి, బ్లూకోట్‌ సిబ్బంది సంపత్, మోయినొద్దీన్‌ గాలించగా అందులో రెండు బుల్లెట్లు లభించాయి. ఇంట్లో మరో రెండు బుల్లె ట్లు, ఖాళీ కాట్రిడ్జ్‌ స్వాధీనం చేసుకున్నారు.
 
ఖట్మండు నుంచి గన్‌..
ఉపాధి నిమిత్తం నేపాల్‌ వెళ్లిన కనుకయ్య అక్కడ చిత్తుకాగితాలు, ఇనుప సామగ్రి కొనుగోలు విక్రయాల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద నుంచి నాటు గన్‌ను కొనుగోలు చేశా డు. అది తనకు ఎప్పుడైనా పనికొస్తు ంద న్న భావనతో దీనిని అత్యంత రహస్యంగా గతంలోనే స్వగ్రామానికి తెచ్చి పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవం, బాగా మద్యం మత్తులో ఉండడంతో గన్‌ తెచ్చి భార్యపై కాల్పులు జరిపాడు.
 
కస్టడీకి నిందితులు..
భార్యను కాల్చిన కనుకయ్యతోపాటు అతడిని ప్రేరేపించిన తల్లిదండ్రులు చంద్రమ్మ–రాజసాబును అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎల్‌ఎండీ పోలీసులు కరీంనగర్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించారని సీఐ కరుణాకర్‌రావు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement