
కాళ్ల: భర్త చేతిలో ఓ భార్య హతమైంది. కూతురు ఇంటికి వెళ్లినా వదలకుండా వెంటాడి మరీ భార్యను హత్య చేసిన సంఘటన జువ్వలపాలెంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా సంతోషపురం గ్రామానికి చెందిన కాలువ సావిత్రి (58) కాళ్ల మండలం జువ్వలపాలెంలో ఉంటున్న తన నాల్గవ కూతురు బోధనపు రాజమ్మ ఇంటికి 5వ తేదీన వచ్చింది. శుక్రవారం మూడు గంటలకు సావిత్రి భర్త ధనరాజ్ జువ్వలపాలెం వచ్చి ఎవరూ లేని సమయంలో ఘర్షణ పడి చాకుతో ఛాతీపై కుడివైపు బలంగా పొవడంతో రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. కాలువ ధనరాజు, సావిత్రిలకు నలుగురు ఆడపిల్లలున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు.
దీంతో సావిత్రి కూతుర్ల వద్ద కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాల్గవ కూతురైన రాజమ్మ ఇంటికి వచ్చింది. అయితే శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ధనరాజ్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడుతుండగా అల్లుడు బోధనపు నాగరాజుకు తెలియడంతో వెంటనే ఇంటికి బయలుదేరారు. ఆయన వచ్చేలోగా సావిత్రిని భర్త కత్తితో పొడవడంతో మరణించినట్లు బోధనపు నాగరాజుకు ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సాపురం డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం తరలించారు. రూరల్ సీఐ నాగరాజు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాళ్ల, ఆకివీడు ఎస్సైలు ఎం.రాజ్‌కుమార్, సుధాకరరెడ్డిలు ఉన్నారు.