
ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్/సంబల్‌పూర్ : వివాహమైన మూడు నెలలకే వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలపై దాఖలైన కేసు విచారణ కోసం ఫ్యామిలీ కోర్టుకు విచ్చేసిన మహిళ..భర్త చేతిలో హతమైంది. సోమవారం ఉదయం సంబల్‌పూర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది.
హతురాలిని సంజిత చౌదరిగా గుర్తించారు. సంజిత చౌదరికి 3 నెలల క్రితం రమేష్‌తో వివాహం జరిగింది. వెంటనే వీరి వైవాహిక జీవితంలో కలతలు చెలరేగాయి. దీంతో పుట్టింటికి వెళ్లిన సంజిత విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ కోసం సోమవారం ఆమె కోర్టుకు వచ్చింది.
ఈ సందర్భంగా భర్త రమేష్ కత్తితో దాడి చేసి ఆమె నుదుటిపై గాయపరిచాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి కుదుట పడక పోవడంతో తక్షణమే బుర్లా విమ్ సార్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతుండగా ఆమె తుది శ్వాస విడిచింది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భార్యను తిరిగి రావాలని భర్త అభ్యర్థించినా ఆమె నిరాకరించడంతో భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుని పోలీసులు అరెస్టు చేసి దాడికి వినియోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘ టనలో మృతురాలి తల్లి లలిత, మేనకోడలు బాలిక శివానీ కూడా గాయపడ్డారు.