
నిందితుడు నీలకంఠ ఖిలో
జయపురం : జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీస్‌సేష్టన్ పరిధి పొడెయిగుడ గ్రామానికి చెందిన వివాహిత మృతదేహం దుర్గంధం వెదజల్లుతూ పాడుబడిన నూతిలో పది రోజుల క్రితం లభించిన ఘటనలో ఆమెను భర్తే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం కాగా ఎట్టకేలకు ఈ కేసులో బొయిపరిగుడ పోలీసులు చిక్కుముడిని విప్పారు. తన కుమార్తెను హత్య చేశారని హతురాలి తండ్రి దొరాపుట్ గ్రామానికి చెందిన మాధవ ఖొర ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు ప్రారంభించారు.
విచారణ పూర్తయిన తరువాత భర్తే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించి హతురాలి భర్త నీలకంఠ ఖిలోను అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన నీలకంఠఖిలోతో బుధ్రి ఖిలో(24)తో 2014లో వివాహమైంది. వీరి వివాహమైన కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రేగాయి. తరచూ భర్తతో తగువులు పడుతున్నందున ఆమె కన్నవారింటికి వెళ్తూ అక్కడే ఎక్కువకాలం ఉండేది. అయితే వారిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పేందుకు కులపెద్దలైన రొణసమాజ్ వారు కృషి చేయడంతో ఆమె గత ఏప్రిల్‌లో అత్తవారింటికి వచ్చింది.
వివాహేతర సంబంధం అనుమానం
గత నెల 19 వ తేదీన తనకు ఆరోగ్యం బాగా లేదని, చికిత్స కోసం రూ.5 వేలు ఇమ్మని భర్తను అడిగింది. అందుకు భర్త నీలకంఠ నిరాకరించాడు. దీంతో భార్యభర్తల మధ్య మళ్లీ తగాదా జరిగింది. అదేరోజు అర్ధరాత్రి నీలకంఠ భార్య గొంతు నులిమిహత్యకు పాల్పడ్డాడు. అయితే భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు రుజువు చేసేందుకు మృతదేహాన్ని పాడుబడిన నూతిలో పడవేశాడు. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానం కూడా ఆమెను హత్య చేసేందుకు మరోకారణమని పోలీసులు భావిన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.