
దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో భర్త చేతిలో హత్యకు గురైన కేతా ధానేశ్వరి
దేవరపల్లి: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈఘటన దేవరపల్లి మండలం దుమంతునిగూడెంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం అత్తిలి మండలం మంచిలికి చెందిన కేతా తాతారావుతో ఇరగవరం మండలం ఓడిగి గ్రామానికి చెందిన దానేశ్వరి(28)కి 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల వయసున్న రాము, తొమ్మిదేళ్ల వయసున్న తేజా సంతానం. మూడేళ్ల క్రితం తాతారావు కువైట్ వెళ్లి మూడు నెలల క్రితం గ్రామానికి తిరిగివచ్చాడు. అప్పటి నుంచి భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ధుమంతునిగూడెంలో నివసించే మృతురాలి అక్క లక్ష్మి 45 రోజుల క్రితం తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి దానేశ్వరి అక్క ఇంటి వద్దే ఉంటుంది.
ఇద్దరు పిల్లలు దానేశ్వరి ఆడపడుచు గ్రామమైన రెడ్డిగణపవరంలో ఉంటున్నారు. 45 రోజుల్లో రెండు పర్యాయాలు తాతారావు ధుమంతునిగూడెం వచ్చి భార్యతో గొడవ పడి వెళ్లాడు. అప్పటినుంచి దానేశ్వరి కాపురానికి వెళ్లకపోవడంతో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాతారావు ధుమంతునిగూడెం చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో భార్య దానేశ్వరిని బలమైన వస్తువుతో తలపై మోది హతమార్చాడు. అనంతరం తాతారావు అక్కడ నుంచి పారిపోయాడు.
సాయంత్రం 6 గంటల సమయంలో దానేశ్వరి అక్క లక్ష్మి పొలం పని నుంచి ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్నట్టు గుర్తించి ఫిర్యాదు చేసినట్టు ఎస్సై పి.వాసు తెలిపారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఆయన వివరించారు.