
ఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పెద్దపల్లి : ‘రాత్రి నిద్రపోయిన సమయంలో ముగ్గురు దొంగలు వచ్చారు.. ఎవరని ప్రశ్నించా.. మాది రాఘవాపూర్ అని ఒకరు.. గౌరెడ్డిపేట అని మరొకరు.. ఇలా అంటూనే మా భర్తపై దాడి చేశారు.. అడ్డుకోబోయిన నా గొంతు పిసికేందుకు ప్రయత్నించారు. చివరికి గొడ్డలితో నరికి చంపి వెళ్లారు’.. కథ కుదరలేదు. పోలీసులకు అనుమానం కలిగింది. చనిపోయిన వ్యక్తి భార్యనే విచారించారు. ఇంతలో నిజం బయట పడింది. గ్రామస్తులు నివ్వెరపోయారు.
ఈసంఘటన పెద్దపల్లి మండలం బందంపల్లి శివారులోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. కొక్కుల ఓదెలు (60) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు భార్య చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. రాజేశ్వరి ఉద్దేశపూర్వకంగా భర్తను వదిలించుకునేందుకు దారుణానికి ఒడిగట్టింది. ఇంటికి చుట్టాలు, బంధువులు ఎవరు వచ్చినా ఓదెలు దూషించేవాడని.. చివరికి కన్న కొడుకు, కోడలు, కూతురు, అల్లుడిని కూడా దూషించడంతో సహించలేక హతమార్చినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.
గురువారం రాత్రి కుటుంబంలో గొడవ జరగడంతో ఇక ఓదెలును హతమార్చేందుకు పథకం పన్నిన రాజేశ్వరి శుక్రవారం వేకువజామున 3గంటల సమయంలో గొడ్డలితో నరికి హతమార్చినట్లు సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్ తెలిపారు. ఈ మేరకు రాజేశ్వరిపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment