విష్ణువర్ధన్ నీటిలో మునిగి మృతిచెందిన కాలువ, విష్ణువర్ధన్ (ఫైల్)
సాక్షి, పెద్దపల్లి(మంథని): ‘అయ్యో కొడుకా.. ఎంత పనాయే.. మీ నాన్న ఆరోగ్యం సహకరించకపోయినా కూలీనాలీ చేసుకుంట మిమ్మల్ని చదివిస్తున్న. రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురిని సాదుకుంటున్న. మీరే సర్వస్వం అనుకుని మిమ్మల్ని చూసుకునే బతుకుతున్న. ఎంత కష్టమైనా భరించుకుంటున్న. ఇప్పుడు పుట్టెడు శోకంలో ముంచితివి కదా బిడ్డా..’ అంటూ ఆ తల్లి గుండలవిసేలా రోదించింది. రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి బేగంపేట క్రాస్ రోడ్డుకు చెందిన పదో తరగతి విద్యార్థి తంగళ్లపల్లి విష్ణువర్ధన్ సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాతపడగా.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
తంగళ్లపల్లి రామచంద్రం, రాజ్యలక్ష్మి దంపతులది స్వగ్రామం లద్నాపూర్ కాగా.. ఆ గ్రామాన్ని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 20ఏళ్ల క్రితమే జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. రామచంద్రం మానసికస్థితి సరిగా లేకపోవడంతోపాటు పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో రాజ్యలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతోపాటు భర్తను కాపాడుకుంటోంది. మొదటి కుమారుడు కేశవర్ధన్ ఐటీఐ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే..
పాఠశాల ఆవరణంలోకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు
ఎస్సారెస్పీ కాలువ నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో తోటి మిత్రులు ఫిరోజ్, శ్రీతరుణ్‌తో కలిసి ఈతకు వెళ్లాడు. ముగ్గురు కాలువలోకి దిగారు. అయితే విష్ణువర్ధన్ నీటిలో అడుగుభాగంలో ఉన్న పూడికలో దిగబడి మునిగిపోయాడు. పాఠశాల యథావిధిగా నిర్వహించి ఉంటే విష్ణువర్ధన్ ఈతకు వెళ్లేవాడే కాదని, సెలవు ఇవ్వడంతోనే సరదా కోసం ఈతకెళ్లి తిరిగి రాని లోకాలు చేరాడని స్థానికులు కంటతడి పెట్టారు.
కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు
సింగరేణి సంస్థ ఓసీపీ–2 ఓబీ యార్డును ఆనుకుని కాలువ పనులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీకి చెందిన కాంట్రాక్టర్ పని స్థలంలో ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోకపోవడంతోనే తన కొడుకు చనిపోయాడని రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై కటికె రవిప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment