నాగమునెమ్మ మృతదేహం ,తల్లి కనిపించకపోవడంతో బిక్కమొహం వేసుకున్న ముగ్గురు పిల్లలు
మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. కూలి పనికి వెళ్లి ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న ఇల్లాలికి చిత్రహింసలతో నరకం చూపించాడు. చివరకు విచక్షణారహితంగా దాడి చేసి మట్టుబెట్టాడు. పిల్లలను అనాథల్ని చేశాడు. ఈ సంఘటన గుంతకల్లు మండలం గుండాల గ్రామంలో శుక్రవారం జరిగింది.
గుంతకల్లు రూరల్ : గుండాల గ్రామానికి చెందిన మంగమ్మ, రామాంజనేయులు దంపతుల కుమారుడు రాజుకు, పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన చిన్న మునెప్ప, సుంకమ్మ దంపతుల కూతురు నాగమునెమ్మ అలియాస్ చిట్టెమ్మ(28)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు రామాంజినమ్మ(6), షర్మిల (4), ఒక కుమారుడు వీరాంజనేయులు (2) ఉన్నారు. వివాహం తరువాత భార్యతో కలిసి వేరుకాపురం పెట్టిన రాజు తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన గొర్రెలను తాగుడు కోసం అమ్మేశాడు. భర్త తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా తట్టుకున్న నాగమునెమ్మ కూలి పనులు చేసుకుంటూనే తన ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. రాజు తన భార్య సంపాదనలో దాచుకున్న డబ్బుతోపాటు, ఇంట్లోని వస్తువులను అమ్ముకుని రోజూ మద్యం తాగి వచ్చేవాడు. నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వేధించేవాడు. భర్త ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన నాగమునెమ్మ 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై బుద్ధిగా ఉంటానంటూ రాజు నమ్మబలికి మూడు రోజుల క్రితం ఆమెను తిరిగి గుండాలకు తీసుకువచ్చాడు. రెండు రోజులుగా మద్యం మత్తులోనే తూగుతున్న రాజు గురువారం రాత్రి తన భార్య నాగమునెమ్మపై విచక్షణా రహితంగా దాడిచేసి చంపాడు.
మృతిపై పొంతనలేని సమాచారం
భర్త దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన నాగమునెమ్మను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసుకున్న రాజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె పుట్టింటి వారికి సమాచారం అందించాడు. అదికూడా తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా కిందపడి మృతిచెందిందని ఒకసారి, మిద్దెపైకి ఎక్కుతూ కాలుజారి కిందపడటం వల్ల మృతిచెందిందని మరోసారి పొంతనలేని సమాధానాలతో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో హడావిడిగా గుండాలకు చేరుకున్న బంధువులు మృతురాలి శరీరంపై ఉన్న గాయాలను చూసి.. భర్తే కొట్టిచంపాడన్న ఆగ్రహంతో అతడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో రాజు అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అమ్మా.. అమ్మా...
భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంటూ కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లి చనిపోవడంతో.. ‘అమ్మా... అమ్మా...’ అంటూ రెండేళ్ల బాలుడు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి కనిపించకపోవడంతో అక్క చంక నుండి దిగకుండా, ఇతరుల దగ్గరకు వెళ్లకుండా గుక్కపట్టి ఏడ్చాడు. ఏడేళ్ల వయసులోనే కన్నతల్లిలాగా బాలుడిని బుజ్జగిస్తున్న అక్కను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment