
సాక్షి, హైదరాబాద్
లాటరీలో రూ. కోట్లు తగిలాయంటూ నమ్మించి ఓ కుటుంబాన్ని సైబర్ ముఠా నిండా ముంచింది. లాటరీ సొమ్ము ఇచ్చే పేరిట రూ. లక్షల్లో వసూలు చేసి బురిడీ కొట్టించింది. అప్పనంగా కోట్లు వస్తాయని అత్యాశతో ఆ కుటుంబం నేరగాళ్లు చెప్పిన సొమ్ము చెల్లించేందుకు ఇంటిని సైతం అమ్ముకొని నిలువ నీడను కోల్పోయింది. చివరకు మోసపోయామని గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
ఎస్‌ఎంఎస్‌తో మొదలైన వ్యవహారం...
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఫెరోజ్‌ఖాన్ విద్యార్థి. అతడి సెల్‌ఫోన్‌కు కొన్ని రోజుల క్రితం ఓ సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) వచ్చింది. శాంసంగ్ ప్రోమో లాటరీలో మీ నంబర్ ఎంపికైందని, ప్రైజ్ మనీ కింద రూ. 3.6 కోట్లు గెల్చుకున్నారన్నది దాని సారాంశం. ఈ మొత్తం పొందాలంటే పూర్తి వివరాలు పంపాలని సైబర్ నేరగాళ్లు samsungclaimdepart ment@gmail.com అనే నకిలీ ఈ–మెయిల్ ఐడీని పంపారు. లాటరీ విషయాన్ని ఫెరోజ్ తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. దీంతో ఫెరోజ్ నేరగాళ్లు సూచించిన ఈ–మెయిల్‌కు తన పూర్తి వివరాలు పంపాడు.
ఆర్‌బీఐ వెబ్‌సైట్ స్క్రీన్ షాట్‌తో మోసం...
ఫెరోజ్ పంపిన వివరాల ప్రకారం అతడి ఈ–మెయిల్ ఐడీ ద్వారా సైబర్ నేరగాళ్లు పని ప్రారంభించారు. ఆర్‌బీఐ ఆన్‌లైన్ పేరుతో ఈ–మెయిల్ పంపిన నేరగాళ్లు... అందులో ఆర్‌బీఐ వెబ్‌సైట్ స్క్రీన్ షాట్‌ను జత చేశారు. ఈ–మెయిల్‌లో ఉన్న ఆ లింకు ఓపెన్ చేసిన ఫెరోజ్ అందులో తన బ్యాంకు ఖాతా వివరాలు నింపి ఎంటర్ బటన్ నొక్కగానే ‘ఎంటర్ కాట్ కోడ్’అనే సందేశం వచ్చింది. దీంతో ఆ కోడ్ చెప్పాలని సైబర్ నేరగాళ్లను ఫెరోజ్ ఈ–మెయిల్ ద్వారా కోరగా అందుకు కొంత రుసుము చెల్లించాలంటూ చెప్పి తమ బ్యాంకు ఖాతాల్లోకి తొలుత రూ. 1.3 లక్షలు డిపాజిట్ చేయించుకొని ఓ కోడ్ పంపారు.
వరుసగా ‘కోడ్స్’పేరు చెప్పి...
ఫెరోజ్ తనకు వచ్చిన కోడ్‌ను ఆర్‌బీఐ లింక్ పేజీలో ఎంటర్ చేయగా అది ఒక కోడ్ తర్వాత మరొకటి అడుగుతూ పోయింది. ఫెరోజ్ సైతం ఆ కోడ్‌ల కోసం ఓసారి రూ.3.5 లక్షలు, మరోసారి రూ.4 లక్షలు, ఇంకోసారి రూ.5 లక్షలు.. ఇలా రూ. 17 లక్షల వరకు డిపాజిట్ చేశాడు. ఈ ‘కోడింగ్’పూర్తయ్యాక ఫెరోజ్ ఆ వెబ్‌పేజ్‌లో ‘ఎంటర్’బటన్ నొక్కగా ‘ఎమౌంట్ ట్రాన్స్‌ఫర్డ్’అని కనిపించింది. దీంతో సంబరపడ్డ ఫెరోజ్ తన ఖాతాలోకి రూ.3.6 కోట్లు వచ్చుంటాయని భావించాడు. అయితే సైబర్ ముఠా మరోసారి ఫెరోజ్‌ను బురిడీ కొట్టించింది. ఆ సొమ్ము అతని ప్రస్తుత బ్యాంకు ఖాతాలోకి రాదని, ప్రత్యేక ఖాతాలోకి వెళ్తాయంటూ సందేశం పంపింది.
డ్రా చేస్తే రూ.15 వేలు రావడంతో...
కొన్ని రోజులకు నేరగాళ్లు కొరియర్ ద్వారా ఫెరోజ్‌కు ఓ ఏటీఎం కార్డు పంపించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ జారీ చేసినట్లు మహ్మద్ ఫెరోజ్ ఖాన్ పేరుతో ఉన్న ఆ ఏటీఎం కార్డుతోపాటు పిన్ నంబర్ కూడా వచ్చింది. దీంతో రూ.3.6 కోట్లు తనకు వచ్చినట్లు భావించిన బాధితుడు ఏటీఎం కేంద్రానికి వెళ్లి డ్రా చేసుకునే ప్రయత్నం చేయగా కేవలం రూ.15 వేలే వచ్చాయి. అప్పటికీ తాను మోసపోయానని గ్రహించని ఫెరోజ్...మరోసారి సైబర్ నేరగాళ్లను సంప్రదించాడు. కోడ్ మారిందని చెప్పిన సైబర్ ముఠా కొత్త కోడ్ పంపడానికంటూ మరో రూ.5 లక్షలు వసూలు చేసింది.
ఈ సొమ్ము చెల్లింపులో భాగంగా ఫెరోజ్ తనకు వచ్చిన రూ.15 వేలను సైతం నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేశాడు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. సైబర్ నేరగాళ్లకు రూ. 22 లక్షలు డిపాజిట్ చేయడానికి తమ ఇంటిని అమ్ముకోవడంతోపాటు అనేక చోట్ల అప్పులు చేశామంటూ ఫెరోజ్ వాపోయాడు.