రవిప్రకాశ్‌ అరెస్ట్‌... | Hyderabad Police Arrested TV9 Ex CEO Ravi Prakash In Cheating Case | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ అరెస్ట్‌...

Published Sun, Oct 6 2019 2:25 AM | Last Updated on Sun, Oct 6 2019 8:15 AM

Hyderabad Police Arrested TV9 Ex CEO Ravi Prakash In Cheating Case - Sakshi

కోర్టు వద్ద రవిప్రకాశ్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బోర్డు తీర్మానం లేకుండా దాదాపు రూ.18 కోట్లు చీటింగ్‌ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్‌ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేశారని, అయితే టీడీఎస్‌ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోందని అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ జి.సింగారావు బంజారాహిల్స్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 

టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్‌హోల్డింగ్‌ను ఈ ఏడాది ఆగస్టు 27 నాటికి అలందా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించగా, రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని తేలింది. 2018 సెప్టెంబర్‌ 18న , 2019 మార్చి 3న,మే 8న రవిప్రకాశ్‌ రూ.6,36,000, 2018 అక్టోబర్‌ 24, డిసెంబర్‌ 10, 2019 మే 8న ఎంవీకేఎన్‌ మూర్తి రూ.5,97,87,000లు, కంపెనీ డైరెక్టర్‌ క్రిఫర్డ్‌ పెరీరా 2018 అక్టోబర్‌ 24, డిసెంబర్‌ 10, 2019 మే 8న రూ.5,97,87,000 డ్రా చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి కింద రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలిసింది. 

కంపెనీకి నష్టం కలిగించడంతో పాటు మోసపూరితంగా చేసిన లావాదేవీలను బోనస్, ఎక్స్‌గ్రేషియా రంగుపులిమే ప్రయత్నం చేశారు. బోర్డు తీర్మానం లేకుండా అలాంటివి ఇచ్చే వీలుండదు. కంపెనీ షేర్‌హోల్డర్స్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆమోదం తీసుకోకుండానే బోనస్, ఎక్స్‌గ్రేషియాగా రికార్డు చేయాలని అకౌంటెంట్లకు వారు సూచించినట్లు తెలిసింది. ‘సెప్టెంబర్‌ 24న జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో ఈ మోసపూరిత లావాదేవీలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాకే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నగదును తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాం’అని ఫిర్యాదులో జి.సింగారావు పేర్కొన్నారు.

పోలీసులతో వాగ్వాదం..
బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్‌ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, మీరెవరంటూ రవి ప్రకాశ్‌ ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్‌ వరకు తన కారులోనే వస్తానని చెప్పగా పోలీసు వాహనాన్ని ఎస్కార్టుగా పెట్టి స్టేషన్‌కు తరలించారు. అనంతరం రవిప్రకాశ్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కూడా టీవీ9కు సంబంధించిందని గతంలోనే అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీతాఫల్‌మండిలో మేజిస్ట్రేట్‌ ముందు ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై ఈ నెల 9న విచారణకు రానుంది.

కస్టడీలోకి తీసుకుంటాం: వెస్ట్‌జోన్‌ డీసీపీ సుమతి
సొంత అవసరాల కోసం భారీ మొత్తంలో కంపెనీ నగదు డ్రా చేసుకున్న రవిప్రకాశ్‌ను పోలీసు కస్టడీకి తీసుకుంటాం. టీవీ9 తాజాగా సమర్పించిన రికార్డుల ఆధారంగా నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశాం. రవిప్రకాశ్‌ను విచారిస్తే పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement