
క్లినిక్ నిర్వాహకులతో మాట్లాడుతున్న డాక్టర్ చందు నాయక్
షాద్‌నగర్‌లో సాయి మైత్రి క్లినిక్ మూసివేత
షాద్‌నగర్‌టౌన్: పెళ్లి కాకుండానే గర్భందాల్చిన ఓ యువతికి ప్రైవేటు క్లినిక్‌లో వైద్యుడు అబార్షన్ చేసిన సంఘటన గురువారం ఉదయం షాద్‌నగర్ పట్టణంలో వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన యువకుడు, కేశంపేటకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే యువతి పెళ్లికాకుండానే గర్భం దాల్చడంతో యువతి కుటుంబ సభ్యులు, ప్రియుడు షాద్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సాయిమైత్రి పాలీ క్లినిక్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించారు. గర్భందాల్చి మూడు నెలలు కావొస్తుందని, వెంటనే అబార్షన్ చేయాలని వైద్యుడు సూచించాడు. బుధవారం రాత్రి క్లినిక్‌లో నిబంధనలకువిరుద్ధంగా అబార్షన్ చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు క్లినిక్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే అప్పటికి క్లినిక్‌లో డాక్టర్, ఆపరేషన్ చేయించుకున్న యువతి, వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం గమనార్హం. క్లినిక్ నిర్వాహకులు, నర్సుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు.
సమగ్ర విచారణ చేపడుతాం:చందునాయక్
సాయి మైత్రి పాలీ క్లినిక్‌లో యువతికి అబార్షన్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్లినిక్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలకు ఉల్లంఘించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి యువతికి అబార్షన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సాయి మిత్ర క్లినిక్ నిర్వహించేందుకు కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, గత రెండు నెలల క్రితం తనిఖీల చేసి క్లినిక్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు.