రికార్డులు పరిశీలిస్తోన్న ఏసీబీ సీఐ గణేశ్
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ అవినీతి జలగల అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీఆర్‌వోలు కాండ్రేగుల సంజీవ్‌కుమార్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జీవీఎంసీ అధికారి మునికోటి నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి అక్రమార్జనపై అధికారులు మరింత లోతుగా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సంజీవ్‌కుమార్ బినామీలు బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖార్జునరావు, సామ ఉదయనాగరాజును ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, అప్పారావు ఆదివారం ఉదయం నుంచి విచారించారు. విచారణలో కీలకమైన ఒక ల్యాప్‌టాప్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటికే వీరి అక్రమార్జన రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు.
తాజాగా గుర్తించిన అక్రమాస్తులివీ
- సంజీవ్‌కుమార్ బినామీగా వ్యవహరించిన బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖర్జురావు(ఒకప్పుడు బిల్డర్) పేరు మీద ఆదిత్యవర్థన్ డెవలప్‌మెంట్ అనే సంస్థ పేరిట కొత్తవలస సమీప గంగువాడ గ్రామంలో 200 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
- సుమారు రూ.ఆరు కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు లాప్‌ట్యాప్‌లో గుర్తించారు. దీంతో లాప్‌ట్యాప్‌ను సీజ్ చేశారు.
- చెతన్యనగర్‌లో ఉన్న శ్రీసాయి ఆదిత్య నిలయం –1లోని 303 ప్లాట్ పి.విజయ పేరు మీద ఉంది. అయితే ఈ ప్లాట్‌లో సోమవారం సోదాలు చేయనున్నారు. సంజీవ్‌కుమార్ అక్రమార్జనకు తతంగం అంతా ఇక్కడి నుంచే జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
- రెల్వే న్యూ కాలనీలో సుజన కనస్ట్రక్షన్ పేరు మీద బినామీలతో సంజీవ్‌కుమార్ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నాడు.
- అదేవిధంగా సంజీవ్‌కుమార్ వినియోగిస్తున్న కారులో నుంచి పలు విలువైన డాక్యుమెంట్లతోపాటు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
- ఎన్‌టీపీసీ వద్ద సంజీవ్‌కుమార్ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
- సంజీవ్‌కుమార్ వద్ద ఉన్న ఫిస్టల్ బటన్ నొక్కితే రెగ్యులర్‌గా మంటలు వస్తున్నాయి. ఈ ఫిస్టల్‌తోపాటు బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు.
- మునికోటి నాగేశ్వరరావు భార్య పేరుమీద ఆమె తల్లిదండ్రులు కానుకగా 339 గజాల స్థలం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.10 కోట్లు ఉంటుందని నిర్థారించారు.
- అదేవిధంగా అతని బావమరిది యాసిడ్ శ్రీను వద్ద సుమారు రూ.85 లక్షలు విలువచేసే ఆస్తులు గుర్తించారు.
లాకర్లలో భారీగా అక్రమాస్తులు!
సంజీవ్‌కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఎస్‌బీహెచ్, ఐఓబీ, ఆంధ్రాబ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్‌లలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిని సోమవారం తెరవనున్నారు. ఇవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు ఆభరణాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీఆర్వో పోలిశెట్టి వెంకటేశ్వరావుకు సంబంధించి ఎన్‌ఏడీలోని యాక్సెస్ బ్యాంక్‌లో ఉన్న లాకర్లు తెరిచారు. అందులో 790 గ్రాముల బంగారం, కిలో వెండి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 16 వరకు రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో అరెస్ట్ అయిన వీఆర్వోలు సంజీవ్‌కుమార్, వెంకటేశ్వరావు, జీవీఎంసీ విద్యుత్ విభాగం మజ్దూర్ ఉద్యోగి నాగేశ్వరరావులను శనివారం శనివారం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16వరకు వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే సంజీవ్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఆయనకు బీపీ పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంకోజీపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రిమాండ్‌కు తరలిస్తారు.
సంజీవ్‌కుమార్ బినామీ సుబ్రహ్మణ్య మల్లికార్జునరావును విచారిస్తున్న సీఐ అప్పారావు
Comments
Please login to add a commentAdd a comment