బెంగళూరు: వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి బోర్డుతిప్పేసిన బెంగళూరు ఐఎంఏ గ్రూప్ కుంభకోణంలో మరో సంచలనం నమోదైంది. రూ.1.5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ బీఎం. విజయ్‌శంకర్‌ను అరెస్టు చేసిన సిట్ పోలీసులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం మళ్లీ ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అనుకూల నివేదిక ఇవ్వడానికి ముడుపులు
సిట్ అభియోగాల ప్రకారం... 2016 చివర్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఐఎంఏ కంపెనీ నిర్వహించిన కోట్లాది రూపాయల వ్యవహారాలపై భారతీయ రిజర్వు బ్యాంక్‌కు అనుమానం రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేపీఐడీ చట్టం ప్రకారం విచారణ చేపట్టాలని బెంగళూరు ఉత్తర ఉపవిభాగాధికారికి సూచించింది. కానీ ఆ విచారణను జిల్లా కలెక్టర్ విజయ్‌శంకర్, ఉపవిభాగాధికారి ఎల్‌సీ.నాగరాజుతో కలిసి చేపట్టారు. ఐఎంఏ కంపెనీ డైరెక్టర్ నిజాముద్దీన్ రెవిన్యూ భవన్‌లో కలెక్టర్ విజయ్‌శంకర్ ను కలిసి ఐఎంఏ కంపెనీకి అనుకూలంగా ఆర్‌బీఐకి నివేదిక పంపితే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టాడు. ఇందుకు కలెక్టర్ రూ.2 కోట్లు లంచానికి డిమాండ్ పెట్టారు. చివరికి ఇరువురి మధ్య రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదిరింది.
ఆ డబ్బుతో భూముల కొనుగోలు
నిజాముద్దీన్ ఒకటిన్నర కోటి నగదును విజయ్‌శంకర్ సూచనల మేరకు ఆర్‌వీ.రోడ్డులోని బిల్డర్ కృష్ణమూర్తికి చేర్చాడు. ఈ డబ్బు ఐఎంఏ కంపెనీకి చెందినదని బిల్డర్ కృష్ణమూర్తి కి తెలియదు. కొద్దిరోజుల అనంతరం ఆ బిల్డర్‌కు మరో రూ.1.5 కోట్ల ను విజయ్‌శంకర్ ముట్టజెప్పాడు. ఈ డబ్బుతో ఆ బిల్డర్ విజయ్‌శంకర్ భార్య పేరుతో జేపీ.నగర, నందికొండలో భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఐఎంఏ అక్రమాలను దాచిపెట్టి, ఆ కంపెనీ అధినేత మన్సూర్‌ఖాన్‌కు అనుకూలంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఈ కేసులో ఉపవిభాగాదికారి నాగరాజు కూడా ఐఎంఏ నుంచి రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల నాగరాజ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా విజయ్‌శంకర్ హస్తం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో సోమవారం ఎస్‌ఐటీ అధికారులు ఆయనను విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏకంగా కలెక్టర్ అరెస్టులో అధికార వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment