చిన్నారి సదియా శుక్‌రాజ్
జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో తొమ్మిదేళ్ల భారత సంతతి చిన్నారి మరణం స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిల్చింది. కారు హైజాకర్ల దాడిలో చిన్నారి సదియా శుక్‌రాజ్ ప్రాణాలు విడిచింది. ఆగ్రహంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం నిరసన ప్రదర్శనలతో డర్బన్ అట్టుడుకుతోంది.
అసలేం జరిగింది.. ఛాట్స్‌వర్త్‌కు చెందిన సదియా శుక్‌రాజ్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో నాలుగో గ్రేడ్ చదువుతోంది. సోమవారం ఆమె తండ్రి శైలేంద్ర శుక్‌రాజ్ స్కూల్‌కు తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ముగ్గురు దుండగులు ఆయుధాలతో వారి కారును అడ్డగించారు. సదియా తండ్రిని బయటకు లాగేసి, కారుతో వేగంగా ఉడాయించారు. చిన్నారి సాయంతో వారు అక్కడి నుంచి తప్పించుకోవాలని యత్నించారు. అయితే అది గమనించిన కొందరు స్థానికులు, సదియా తండ్రితో కలిసి హైజాకర్లపై కాల్పులు ప్రారంభించారు. ఆ కంగారులో కారు అక్కడే ఉన్న ఓ పార్క్‌లో దూసుకెళ్లి గోడను బలంగా ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకడు అక్కడిక్కడే మృతి చెందగా, ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. మరోకడు పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ సదియాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె ఎలా చనిపోయిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. బుల్లెట్ గాయంతో ఆమె చనిపోయిందా? లేక వాహనం బోల్తాపడిన క్రమంలో చనిపోయిందా? అన్నది తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే సదియా మృతిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని క్వా జుల్-నాటల్ పోలీస్ కెప్టెన్ గ్వాలా స్పష్టం చేశారు.
స్థానికుల ఆగ్రహం... డర్బన్‌లోని ఛాట్స్‌వర్త్ భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉండే పట్టణం. ఈ మధ్య అక్కడ నేరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సదియా ఉదంతం స్థానికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. సుమారు 3 వేల మంది ఛాట్స్‌వర్త్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. కేసులో త్వరగతిన దర్యాప్తు ముగించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించటంతో ఉద్రికత్తకు దారితీసింది. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ, బాష్ఫవాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు. 20 మందిని అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. దీంతో ఆందోళనలు డర్బన్ మొత్తం విస్తరించాయి. ఓవైపు సోషల్ మీడియా మొత్తం చిన్నారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అంత్యక్రియల నేపథ్యంలో అల్లర్లు చెలరేగే పరిస్థితులు కనిపిస్తుండటంతో సంయమనం పాటించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment