
న్యూయార్క్ : సవతి కూతురిని దారుణంగా హతమార్చిన భారత సంతతికి చెందిన ఓ మహిళను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. 2016లో చిన్నారిని చంపిన కేసులో ఆమెకు 25 ఏళ్ల శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు జూన్ 3న శిక్షకు సంబంధించిన తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. షామ్‌దాయీ అర్జున్(55) అనే మహిళ భర్త, అతడి తొమ్మిదేళ్ల కూతురితో కలిసి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తోంది. అయితే సవతి కూతురిపై అక్కసు పెంచుకున్న అర్జున్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో 2016 ఆగస్టులో బాధితురాలి గొంతు నులిమి చంపేసింది.
దారుణంగా గాయపరిచి..
విచారణలో భాగంగా ఈ కేసులో సాక్షి అయిన ఓ మహిళ మాట్లాడుతూ..తన మనవలతో కలిసి క్వీన్స్‌లో ఉండే పాత అపార్టుమెంటుకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అర్జున్‌ను కూతురి గురించి ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పిందని తెలిపింది. ఆమెను కలవాలనుకుంటున్నాననగా.. బాత్‌రూంలో స్నానం చేస్తోందని చెప్పిందని.. అయితే గంటల సమయం గడిచినా బయటికి రాకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని పేర్కొంది. దీంతో బాలిక తండ్రిని పిలిచి బాత్‌రూం తలుపులు పగులగొట్టగా.. బాలిక బాత్‌టాబ్‌లో శరీరంపై ఎటువంటి అచ్చాదన లేకుండా నిర్జీవంగా పడి ఉందని తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
కాగా ఈ కేసు గురించి క్వీన్స్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మాట్లాడుతూ.. అర్జున్ మొదటి నుంచి భర్త కూతురిని హింసించేదని పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఆమెను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలి బంధువులు వెల్లడించారన్నారు. మృతురాలి తండ్రి స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవాడని, అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లగానే అర్జున్ కూతురిపై దాష్టీకానికి పాల్పడేదని వివరించారు. ఇందులో భాగంగా 2016 ఆగస్టులో ఓ రోజు బాధితురాలికి స్నానం చేయిస్తానని చెప్పి, అక్కడే దారుణంగా కొట్టి.. గొంతు నులిమి చంపేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment