
అమ్మాయిలను సహాయ శిబిరాలకు పంపుతున్న స్వాతి మలివాల్
న్యూఢిల్లీ/వారణాసి: అంతర్జాతీయ వ్యభిచార ముఠా చెర నుంచి 16 మంది నేపాలీలుసహా 18 మంది అమ్మాయిలను ఢిల్లీ, వారణాసి నేర విభాగం పోలీసులు రక్షించారు. అమ్మాయిలనందరినీ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించి వ్యభిచార ఊబిలో దించాలని ఓ అంతర్జాతీయ ముఠా కుట్రపన్నింది. ఈ కుట్రను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలను సహాయ శిబిరాలకు, నేపాల్ రాయబార కార్యాలయానికి పంపనున్నట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ చీఫ్ స్వాతి మలివాల్ మీడియాతో చెప్పారు.
అమ్మాయిలను ముఠా నిర్భంధించిన ఇంటిలో 68 పాస్‌పోర్టులు దొరికాయని, వీటిలో ఏడు భారత పాస్‌పోర్టులని స్వాతి పేర్కొన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కొందరు నేపాలీ అమ్మాయిలను ముఠా ముందుగా వారణాసికి తీసుకొచ్చింది. వీరిలోంచి ఇద్దరు అమ్మాయిలు జూలై మొదటివారంలో తప్పించుకుని నేపాల్ పోలీసులకు, నేపాల్ ఎంబసీకి సమాచారమిచ్చారు. ఎంబసీ ఇచ్చిన వివరాలతో పోలీసులు వారణాసిలో ఆరేడు చోట్ల సోదాలుచేసి ముఠాతో సంబంధమున్న జైసింగ్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో వారణాసి, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు అమ్మాయిలను రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment