సాక్షి, హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. 2004లో ఆయన బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై పాస్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో నార్త్‌జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న జగ్గారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మార్కెట్ పోలీసులకు అప్పజెప్పారు.
మరో బృందం మెదక్ జిల్లాలో ఉన్న ఆయన అనుచరుడిని (అప్పట్లో ఆయనకు పీఏగా పనిచేశారు) అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించింది. ప్రస్తుతం వారిద్దరినీ పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వారు అక్రమ రవాణా చేసిన గుజరాతీయులు ఎవరనేది గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ గుజరాతీయులు అమెరికాలోనే ఉన్నట్లు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఏ దళారుల ద్వారా జగ్గారెడ్డి ఈ అక్రమ రవాణాకు అంగీకరించారు.. ప్రతిఫలంగా ఆయనకు ఏం దక్కింది తదితర అంశాలను విచారిస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. జగ్గారెడ్డి వద్ద పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2007లో ఓ ఎంపీ అరెస్ట్‌తో కదిలిన డొంక...
2007లో ఢిల్లీ పోలీసులు బాబూభాయ్ ఖటారా అనే ఎంపీని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతోనే దేశంలో తొలిసారిగా మనుషుల అక్రమ రవాణా డొంక కదిలింది. అనివార్య కారణాల నేపథ్యంలో గుజరాతీయులకు అప్పట్లో అమెరికా వీసాలను నిలిపివేసింది. విజిట్ సహా వివిధ రకాల వీసాలపై తమ దేశం వచ్చే గుజరాతీయులు అక్రమంగా స్థిరపడిపోతున్నారని ఆరోపిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో గుజరాతీయుల అక్రమ రవాణాకు దేశంలో నాంది పడి క్రమంగా జోరందుకుంది.
దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ముఠాలుగా ఏర్పడిన దళారులు రాజకీయ నాయకులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వారికి డిప్లొమాటిక్ పాస్‌పోర్టులు సహా మరికొన్ని సదుపాయాలు ఉండటంతో డబ్బు ఆశజూపి అనేక మంది ప్రజాప్రతినిధులను తమ దారిలోకి తెచ్చుకున్నారు. గుజరాతీయులను ఆయా రాజకీయ నాయకుల భార్య, పిల్లలుగా చూపిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు పొందేవారు. ఈ పాస్‌పోర్టుల ఆధారంగా తమ లెటర్‌హెడ్లను వినియోగించి వీసా కోసం ఆయా కాన్సులేట్లకు లేఖలు రాసే వారు. వాటి ఆధారంగా గుజరాతీయులకు అమెరికా వీసాలు లభించేవి. ఇలా గుజరాతీయులను తమతోపాటు తీసుకెళ్లి అమెరికాలో వదిలేసి వచ్చేవాళ్లు. 2007లో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టు తరవాత దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌లోనూ కొన్ని అరెస్టులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment