పెళ్లి అని చెప్పి తుపాకీ కొన్నాడు.. | Jamia Shooting: Teenager Bought Gun From UP dealer | Sakshi
Sakshi News home page

‘జామియా’ కాల్పులు: కొత్త విషయాలు

Feb 1 2020 2:02 PM | Updated on Feb 1 2020 2:25 PM

Jamia Shooting: Teenager Bought Gun From UP dealer - Sakshi

జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పులు జరిపిన బాలుడు

జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

న్యూఢిల్లీ: పౌరసత్వ నిరసనకారులపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన 17 ఏళ్ల మైనర్‌ బాలుడు తుపాకీని ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. జీవార్‌ ప్రాంతానికి చెందిన అతడు తన గ్రామానికి సమీపంలోని డీలర్‌ నుంచి 10 వేల రూపాయలకు తుపాకీ కొన్నట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి జరగనున్న తన సోదరుడిలో పెళ్లిలో కాల్పులు జరపడానికి అని అబద్ధం చెప్పి తుపాకీని కొన్నట్టు తెలిపారు. బంగారు రంగులో ఉన్న సింగిల్‌షాట్‌ తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను బాలుడికి డీలర్‌ ఇచ్చినట్టు చెప్పారు. వాడకుండా ఉన్న మరో బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

‘బాలుడికి తుపాకీ విక్రయించిన డీలర్‌ను గుర్తించాం. వ్యాపారిని పరిచయం చేసిన నిందితుడి మిత్రుడిని కూడా కనిపెట్టాం. వీరి కోసం మా బృందాలు వెతుకుతున్నాయి. సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామ’ని దర్యాప్తు అధికారులు తెలిపారు. తుపాకీ డీలర్‌, నిందితుడి స్నేహితుడిని పట్టుకునేందుకు యూపీ పోలీసుల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు తమను సంప్రదించలేదని యూపీ పోలీసులు పేర్కొనడం గమనార్హం. స్థానిక రాజకీయ నాయకులెవరైనా బాలుడికి తుపాకీ ఇచ్చివుంటారని భావించామని గ్రామస్తుడొకరు వెల్లడించారు. నిందితుడు రాజకీయ నేతలతో తిరిగేవాడని చెప్పారు. 

గర్వపడే పనిచేస్తానంటూ..
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని, సోదరుడి పెళ్లికి హాజరవుతానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్టు వెల్లడించారు. ‘కాలేజీకి వెళ్లకుండా బస్సులో ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత ఆటోలో జామియా మిలియా యూనివర్సిటీకి వచ్చాడు. తుపాకీ అతడి సంచిలో ఉంద’ని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు గర్వపడే పనిచేస్తానని సోదరితో చెప్పినట్టు వెల్లడించారు. ‘నా గురించి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నావా? ఈరోజు నుంచి నా గురించి గర్వంగా చెప్పుకుంటావు’ అని తన సోదరితో బాలుడు అన్నట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement