సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డులకు సంబంధించిన వివరాల తో పాటు వన్‌టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) సైతం సం గ్రహించి... అందినకాడికి దండుకునే జమ్‌తార ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఏ దశలోనూ తమ ఉనికి బయటపడకుండా పక్కాగా వ్యవహారాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఢిల్లీ చెందిన వ్యక్తుల ఖాతాలు వాడుకుంటున్నాయి. ఇందుకుగాను సదరు ఏజెంట్లకు కమీషన్లు ఇస్తున్నాయి. ఈ తరహాలో ప్రధాన సూత్రధారులకు సహకరిస్తున్న ఓ పాత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి సిటీకి తరలించిన ఇతడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్ క్రైమ్’లో 98 శాతం జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే నిందితులు. జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం ఇది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్‌తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డ్స్ తీసుకుని వాటిని ద్వారా కార్డుల డేటాలోని ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డులను వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలిగి తేలిగ్గా బుట్టలో పడతారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ‘జమ్‌త్రాగాళ్లు’ ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చెయ్యాలనో చెబుతూ ఆపై కార్డు వివరాలను సీవీవీ కోడ్ సహా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుందని, అది కూడా చెబితేనే లింకేజ్, అప్‌గ్రేడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం ద్వారా టోకరా వేస్తున్నారు.
వీరు వినియోగించే సిమ్‌కార్డులు ఎలానూ బోగస్ వివరాలతో ఉంటాయి. బాధితుడి ఖాతా నుంచి నగదు మళ్లించుకునే ఖాతాలు తమ పేరుతో, తమ ప్రాంతంలో ఉంటే తేలిగ్గా దొరికేస్తామనే ఉద్దేశంతో వీరు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కొందరిని ఆకర్షించి ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును మళ్లిస్తున్నారు. ఈ ఏజెంట్లకు 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తూ ఆ నగదు తమ వద్దకు చేరేలా చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడికి ఎర వేసిన జమ్‌తార నేరగాళ్లు రూ.79 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఏజెంట్లు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం సైబర్ నేరగాళ్లకు తన బ్యాంకు ఖాతా ఇచ్చి సహకరించిన ప్రేమ్‌చంద్ అనే నిందితుడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై సిటీకి తరలించింది. సోమవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈ స్కామ్ సూత్రధారుల కోసం జమ్‌తారకు ఓ బృందం వెళ్తోంది. వీరు మరెందరినో మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment