కేటుగాడు ఎక్కడ? | Jewellery Robbery In Fivestar Hotels Accused Changing Address | Sakshi
Sakshi News home page

కేటుగాడు ఎక్కడ?

Published Mon, Mar 12 2018 7:55 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

Jewellery Robbery In Fivestar Hotels Accused Changing Address - Sakshi

ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో ఆభరణాలు దొంగిలించే జయేష్‌ రావ్‌జీ భాయ్‌ సేజ్‌పాల్‌

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న ‘సూటు..బూటు’ దొంగ జయేష్‌ రావ్‌జీ భాయ్‌ సేజ్‌పాల్‌ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లోని ఓ రూమ్‌లోకి ప్రవేశించి చాకచక్యంగా రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. ముంబైతోపాటు ఇతర నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించి ఆరా తీస్తున్నారు. 

బంజారాహిల్స్‌: అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే అతిథుల గదులను లక్ష్యంగా చేసుకొని వారు లేని సమయంలో దర్జాగా సూటు, బూటు వేసుకొని హోటల్‌లోకి ప్రవేశిస్తూ ఆభరణాలతో ఉడాయిస్తున్న జయేష్‌ రావ్‌జీ భాయ్‌ సేజ్‌పాల్‌(43) ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన వెంకట్‌ కోనారావు, రిషిక దంపతులు బస చేసిన రూమ్‌ నంబర్‌ 312లో వారు డిన్నర్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు హోటల్‌ సిబ్బందిని మాటల్లోకి దింపి, లిఫ్ట్‌బాయ్‌ దృష్టిమరల్చి దర్జాగా గదిలోకి వెళ్లి  రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో అంతే దర్జాగా ఉడాయించి పోలీసులకు సవాల్‌ విసిరాడు. బంజారాíßల్స్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

నవదంపతులే టార్గెట్‌
ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసించే జయేష్‌ ఎంత దర్జాగా వస్తాడో అంతే దర్జాగా నగలతో ఉడాయిస్తూ కేవలం సీసీ కెమెరాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. పార్క్‌హయత్‌ హోటల్‌లో దొంగతనం చేసిన అనంతరం ఆకుపచ్చ రంగు ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడి నుంచి నేరుగా మాసబ్‌ట్యాంక్‌ వద్ద గోల్కొండ హోటల్‌వైపు ఆటో వెళ్లే విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒక చిన్నహోటల్‌లో బస చేస్తూ బోగస్‌ ధృవపత్రాలు సమర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాను దొంగతనం చేసే హోటల్‌కు బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో వచ్చి కస్టమర్ల కదలికలను గుర్తిస్తుంటాడని కొత్తగా పెళ్లైన వారిని లక్ష్యంగా చేసుకుంటాడని విచారణలో తేలింది. రోజంతా వారి కదలికలపై నిఘా వేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని ఆ తర్వాతే హోటల్‌లోకి ప్రవేశిస్తారని కూడా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎస్‌ఆర్‌నగర్‌ డిఐ కిషోర్, జూబ్లీహిల్స్‌ డీఎస్‌ఐ శ్రీను రెండు రోజులుగా ముంబయిని జల్లెడపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇక మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు న్యూఢిల్లీ, చండీఘడ్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో గాలింపు చేపట్టాయి. నిందితుడి ఆచూకీ కోసం మొత్తం 42 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.  

2016 డిసెంబర్‌ 6వ తేదీన అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లోకి కూడా ఇదే తరహాలో ప్రవేశించి రూ. 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పూన్‌తో ఇక్కడ గదిని తెరిచినట్లు వెల్లడైంది.  
2014లో ఆబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్‌లో ప్రముఖ వ్యాపారి నారాయణదాస్‌ మారు నిర్మలాదేవి బస చేసిన గదిలోకి ప్రవేశించి  రూ. 7 లక్షల విలువచేసే ఆభరణాలు తస్కరించగా ఆబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  
హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రెండుసార్లు ప్రవేశించి ఆభరణాలతో ఉడాయించగా మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.  
2003లో ముంబయిలోని తాజ్‌హోటల్‌లో కూడా ఇదే తరహా దొంగతనానికి పాల్పడ్డాడు.  
2017 అక్టోబర్‌లో విశాఖపట్నం వరుణ్‌ బీచ్‌ హోటల్‌లో ఆభరణాలు తస్కరించాడు.  
2003లో కోలాబ తాజ్‌హోటల్‌లో జరిగిన చోరీ ఘటనలో జయేష్‌ను అక్కడి ´లలీసులు పోలీసులు అరెస్ట్‌ చేయగా అయిదు రోజుల జైలు శిక్ష కూడా పడింది.
2013లో ఛండీగడ్‌లోని హోటల్‌లో కూడా దొంగతనం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement