విలేకరి హత్య కేసు; పాతకక్షలే కారణం | Journalist Murder Mystery Case Find Out | Sakshi
Sakshi News home page

విలేకరి హత్య కేసు; పాతకక్షలే కారణం

Published Wed, Oct 30 2019 9:36 AM | Last Updated on Wed, Oct 30 2019 9:36 AM

Journalist Murder Mystery Case Find Out - Sakshi

తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నయీం అస్మీ 

సాక్షి, తుని (తూర్పుగోదావరి) : తుని మండలం ఎస్‌.అన్నవరంలో నివాసం ఉంటున్న విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడంతో పాటు.. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ వివరించారు.

హత్య కేసులో నేరస్తులను రెండు వారాల్లో ఛేదించినట్టు ఎస్పీ తెలిపారు.  ఎస్‌.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ (గౌరీ), మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయిస్తానని మృతుడు బెదిరించి, రూ.మూడు లక్షలు డిమాండ్‌ చేశాడన్నారు. భయపడిన గౌరీ రూ.రెండు లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్‌ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకున్నారన్నారు. పథకం ప్రకారం హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితులతో కలసి సత్యనారాయణను ఈనెల 15న పథకం ప్రకారం హతమార్చాడని వెల్లడించారు. ఎస్‌.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్‌.అన్నవరానికి చెందిన మడగల దొరబాబు విలేకరి సత్యనారాయణను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు అనుమానితులే 
మృతుడి సోదరుడు కాతా గోపాలకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్న గాబు రాజబాబు, మురాలశెట్టి రాజబాబు సహ ఆరుగురు అనుమానితులేనని ఎస్పీ అస్మి అన్నారు.  నేరస్తులను పట్టుకునేందుకు లక్షకుపైగా ఫోన్‌ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలించామని, సాంకేతిక నిపుణుల సహాయంతో అసలు నేరస్తులను పట్టుకున్నట్టు తెలిపారు. హత్యకు నేరస్తులు వినియోగించిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, రెండు మోటార్‌ సైకిళ్లు, ఆరు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో డీఎస్పీలు రామకృష్ణ, అరిటాకుల శ్రీనువాసరావు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

అక్రమ ఆస్తులు ఇవే!
విలేకరి సత్యనారాయణ తేటగుంటలో 2009లో 64.5 సెంట్లు, 2011లో 91 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్లు,  2013లో 79 సెంట్లు, ఎస్‌.అన్నవరంలో ఎకరా 20 సెంట్లు, తుని వీరవరపేటలో 267 గజాలు ఇంటి స్థలం, 2015లో ఎస్‌.అన్నవరంలో 110 గజాల ఇంటి స్థలం, 2016లో టి.వెంకటాపురంలో 182 గజాలు ఇంటిస్థలం, తేటగుంటలో 42 సెంట్ల భూమి, 2019లో టి.వెంకటాపురంలో 25 సెంట్ల భూమి ఇలా భూములు సంపాదించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్‌.అన్నవరంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి అందులో నివాసం ఉంటున్నాడు. ఇవేకాకుండా బ్యాంకు లాకర్లలో మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement