
దర్శన్‌రెడ్డి(ఫైల్)
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. వారు మంచి ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్దనుంచి రూ.1.90 లక్షలు వసూలు చేశారు. మంచి ఉద్యోగం ఉందని చెప్పి ముందుగా సదరు కన్సల్టెన్సీ జార్జియా దేశానికి పంపించింది. అక్కడ దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నకిలీదంటూ ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి పంపించేశారు. తిరిగి వచ్చిన ఇద్దరు యువకులు ఇదేమిటని కన్సల్టెన్సీని నిలదీయగా.. ఎక్కడో పొరపాటు జరిగిందని, మంచి ఉద్యోగాలు మలేషియాలో ఇప్పిస్తామని మరోసారి నమ్మించారు.
మలేషియాకు విజిట్ వీసా ఇప్పించి, అక్కడికి చేరిన తర్వాత ఎంప్లాయిమెంట్ వీసా ఇప్పిస్తామని చెప్పి పంపించారు. వారు మలేషియా చేరగానే సదరు కన్సల్టెన్సీ చేతులు దులుపుకుంది. దీంతో మలేషియాలో ఎక్కడుండాలి, ఏం చేయాలో తెలియని ఆ యువకులు.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరూ పని ఇవ్వకపోవడంతో సాధ్యపడలేదు. ఈలోగా వీసా గడువు పూర్తయిపోయింది. గడువు ముగిసిన తర్వాత అక్కడి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం మలేషియా జైల్లో ఉన్న తుమ్మల దర్శన్‌రెడ్డి అనే యువకుడి తండ్రి రాజిరెడ్డి సౌదీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి సుగుణ కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో నివసిస్తున్నారు. కుమారుడు జైలు పాలయ్యాడని తెలియడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నారు. నకిలీ వీసాలను అంటకట్టి లక్షల్లో దండుకున్న కన్సల్టెన్సీపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.
విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం
కన్సల్టెన్సీ మోసాలకు గురై మలేషియా జైల్లో మగ్గుతున్న యువకులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మలేషియాలో ఏవైనా చిన్న కారణాల చేత జైల్లో చిక్కుకున్న వారికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేస్తోంది. దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లను స్వదేశానికి తిరిగి పంపించడానికి అధికారులతో సంప్రదిస్తున్నాం.
– ఏళ్ల రాంరెడ్డి, ప్రవాసీమిత్ర అవార్డు గ్రహీత, సింగపూర్
Comments
Please login to add a commentAdd a comment