
ఇంటి డోర్‌పై దొంగ అతికించిన చిట్టి
మంచిర్యాలక్రైం: పట్టణంలోని తిలక్‌నగర్‌లో ఆదివారం చోరీ జరిగింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఇల్లంత సదిరేసి ఎక్కడా ఏం దొరకక పోయేసరికి ఇంటి తాళంచెవి ఎత్తుకెళ్లిపోయాడు. పైగా తాళంచెవులు నాదగ్గర ఉన్నాయని రాసిన చిట్టీని డోర్‌కు అతికించి వెళ్లిపోయాడు. దీంతో వీడెం దొంగరా బాబోయ్ అంటూ కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాధితుని కథనం ప్రకారం పట్టణంలోని తిలక్ నగర్‌కు చెందిన మహ్మద్ బాబర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హైదరాబాద్ వెళ్లిపోయాడు.
సోమవారం ఉదయం ఇంటికి వచ్చిచూసే సరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. పైగా డోర్‌కు ఇది తాలం చెవి నాదగ్గర ఉంది అని రాసి ఉంచాడు. గతంలో సైతం ఇదే ఇంట్లో ఇదే తరహాలో చోరీ జరిగిందని బాధితుడు బాబర్ తెలిపాడు. కాగా ఎలాంటి సొత్తు చోరీకి గురి కాకపోవడం గమనార్హం. బాబర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.