సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మంక్రైం : సమగ్ర సర్వేలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1188 మంది నేరస్తులను గుర్తించినట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరస్తుల విరాలును ఆన్‌లైన్‌లో టీఎస్ కాప్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. అదే విధంగా వారి నివాస గృహాలను గూగుల్ మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవారిని గుర్తించి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పదేళ్ల నాటి రికార్డుల ప్రకారం పదేపదే ప్రాపర్టీ దొంగతనాలు, దోపిడీలు చేసే 2097 మంది నేరగాళ్ల వివరాలు , చిరునామా, ప్రస్తుతం ఎక్కడుంటున్నారు, వారి స్థితిగతులపై సమాచారం సేకరించామన్నారు. కొంతమంది సత్పవర్తనతో మంచి జీవన విధానం కొనసాగిస్తున్నారన్నారు. మరి కొందరు మృతిచెందినట్లు సర్వేలో తెలిసిందన్నారు. 2008–2017 మధ్య దొంగతనాలు, హత్యలు , అత్యాచారాలు ఆర్థిక తదితర నేరాలు ఒకటి కంటే ఎక్కువ పాల్పడి అరెస్ట్ అయిన వారు 11,147మంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1188 మంది పదేపదే ప్రాపర్టీ దొంగతనాలు, దోపిడీలకు చేస్తున్నారని వీరిపై మాత్రం నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment